కల్వకుర్తి రూరల్: గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన సోమవారం మండలంలోని మార్చాలా గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ కురుమూర్తి కథనం ప్రకారం.. మండలంలోని లింగసానిపల్లి గ్రామానికి చెందిన భగవంతు(24) కూలి పనికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి ఆదివారం వెళ్లాడని రాత్రికి తిరిగి రాలేదన్నారు. పట్టణంలోని బీఎస్‌ఎన్‌ఎల్ మైదానంలో నిర్వహిస్తున్న యాగం వద్ద కొద్దిసేపు ఉండి మార్చాలా వైపు నడుచుకుంటూ వెళ్లాడు. ఈ క్రమంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గుండూరు గ్రామానికి చెందిన అతని బంధువు వెంకటయ్య యువకుడి మృతిపై సామాజిక మాధ్యమాల్లో గుర్తించి మృతుడి తల్లి మైసమ్మకు సమాచారం ఇచ్చారు. కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చిన కుమారుడి మృతదేహాన్ని చూసి బోరున విలపించింది. మృతుడికి ముగ్గురు అక్కలు, అన్న ఉన్నాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ కురుమూర్తి తెలిపారు.


