● నాణ్యమైన విత్తనాలు అందుబాటులోఉంచాలి
● జిల్లా వ్యవసాయశాఖ అధికారి వెంకటేష్
మహబూబ్‌నగర్ (వ్యవసాయం): ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి విత్తన డీలర్లు ముందస్తు సన్నద్ధతతో రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి బి.వెంకటేష్ సూచించారు. ఈ మేరకు శుక్రవారం వ్యవసాయ సహాయ సంచాలకులు బి.రాంపాల్ అధ్యక్షతన విత్తన డీలర్లతో ఖరీఫ్ సన్నద్ధత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఏఓ మాట్లాడుతూ సన్నరకాల విత్తనాల లభ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సీడ్ నివేదికలు, రిజిస్టర్లు, బిల్లు పుస్తకాలు, స్టాక్ బోర్డుల నిర్వహణను కచ్చితంగా చేపట్టాలని ఆదేశించారు. పంట అవశేషాలను కాల్చివేయడం వల్ల నేల సారవంతత తగ్గిపోవడంతో పాటు పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతుందని వివరించారు. రైతులు పంటల వైవిధ్యీకరణ వైపు ప్రోత్సహిస్తూ వివిధ రకాల పంటల విత్తనాలను అందుబాటులో ఉంచాలని డీలర్లకు సూచించారు. అధిక మోతాదులో యూరియా వినియోగం వల్ల నేల నాణ్యత దెబ్బతింటుందని, సమతుల్య ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. అలాగే ఎరువుల బుకింగ్ యాప్‌కు సంబంఽధించిన డీలర్ల సందేహాలను అధికారులు నివృత్తి చేశారు. కార్యక్రమంలో ఏఓలు కిరణ్‌కుమార్, వేమారెడ్డి, రాధమ్మ, నరేందర్ పాల్గొన్నారు.


