గ్రామాల్లో తాగునీటి సమస్య రానీయొద్దు | - | Sakshi
Sakshi News home page

గ్రామాల్లో తాగునీటి సమస్య రానీయొద్దు

May 20 2026 2:04 AM | Updated on May 20 2026 2:04 AM

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): జిల్లాలో ఎండలు తీవ్రంగా ఉన్నాయని, గ్రామాల్లో తాగునీటి ఎద్దడి రానీయకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌నాయక్‌ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో నేటికీ మొదలుపెట్టని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వెంటనే ప్రారంభించేలా అధికారులు చొరవ తీసుకోవాలన్నారు. ఎండాకాలంలో ఉపాధి హామీ పనులు అదనంగా నిర్వహిచేందుకు చర్యలు చేపట్టాలన్నారు. పని ప్రదేశాల్లో కూలీలకు టెంట్లు, తాగునీటి వసతి కల్పించాలన్నారు. వచ్చే వానాకాలం సీజన్‌కు అవసరమయ్యే మొక్కలను నర్సరీల్లో పెంచాలని, ఇప్పటికే పెంచుతున్న మొక్కలు ఎండిపోకుండా నీడ సౌకర్యం కల్పించాలని చెప్పారు. సీఎం ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సూచించారు. సమావేశంలో జెడ్పీసీఈఓ వెంకట్‌రెడ్డి, డీఆర్‌డీఓ నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.

పరిసరాల

పరిశుభ్రతే ముఖ్యం

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని నగర మేయర్‌ జి.మమత, మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ పి.రామాంజులరెడ్డి సూచించారు. ‘ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక’లో భాగంగా మంగళవారం అప్పన్నపల్లి, ఏనుగొండ, శ్రీరామకాలనీ, సుభద్రకాలనీ తదితర ప్రాంతాలను పర్యటించారు. ఈ సందర్భంగా ప్రతి వీధిని పరిశీలించి స్థానికంగా నెలకొన్న సమస్యలను ప్రజలతో అడిగి తెలుసుకున్నారు. కాగా, ఆయా వీధుల్లో రోడ్లు, డ్రెయినేజీలు సరిగా లేవని, కుక్కల బెడద తీవ్రంగా ఉందని స్థానికులు ఫిర్యాదు చేశారు. అనంతరం మేయర్‌, కమిషనర్‌ మాట్లాడుతూ ఈ సమస్యలను సాధ్యమైనంత వరకు పరిష్కరిస్తామన్నారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ఎక్కడబడితే అక్కడ బహిరంగ ప్రదేశాల్లో, ఓపెన్‌ ప్లాట్లలో చెత్త వేయొద్దన్నారు. ప్రతి ఇంట్లో తడి చెత్తను ఆకుపచ్చ డబ్బాలో, పొడి చెత్తను ఎరుపు రంగు డబ్బాలో వేసి స్వచ్ఛ ఆటోలకే ఇవ్వాలన్నారు. ఆయా కార్యక్రమాలలో కార్పొరేటర్‌ పెద్దగొల్ల నర్సింహులు, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ లక్ష్మయ్య, ఏఈ రాగవినతి పాల్గొన్నారు.

ఆర్‌ఎన్‌ఆర్‌ @ రూ.2,411

దేవరకద్ర: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో మంగళవారం ఆర్‌ఎన్‌ఆర్‌ ధాన్యం గరిష్టంగా రూ.2,411, కనిష్టంగా రూ.2,149 ధరలు లభించాయి. హంస సరాసరిగా రూ. 1,769, ఆముదాలు సరాసరిగా రూ.6,121 చొప్పున పలికాయి. మార్కెట్‌కు దాదాపు వేయి బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది.

Advertisement
 
Advertisement
Advertisement