కోయిల్‌సాగర్‌ @ 72 ఏళ్లు | - | Sakshi
Sakshi News home page

కోయిల్‌సాగర్‌ @ 72 ఏళ్లు

May 19 2026 1:04 AM | Updated on May 19 2026 1:04 AM

నిర్మాణ వ్యయం రూ.84 లక్షలు

అనంతరం 13 గేట్ల నిర్మాణానికి రూ.91 లక్షలు కేటాయింపు

ఎత్తిపోతల పథక రూపకల్పనకు రూ.359 కోట్లు

పర్యాటకానికి రూ.10 కోట్లు

కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టు వద్ద పర్యాటకుల సందడి (ఫైల్‌)

దేవరకద్ర: పాలమూర్‌ జిల్లాకు వరప్రదాయిని అయిన కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టు ప్రారంభమై నేటికి 70 ఏళ్లు పూర్తి చేసుకుంది. 1947 సంవత్సరంలో అప్పటికి నిజాం ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 1.20 టీఎంసీల నీటి సామర్థ్యంతో 26.6 అడుగుల ఎత్తు అలుగు ఉండే విధంగా ప్రాజెక్టును 1954లో పూర్తి చేసి మొదటిసారి 9 వేల ఎకరాలకు సాగునీరు అందించారు. ఆ తర్వాత 1984లో ఎమ్మెల్యే వీరారెడ్డి రూ.91 లక్షల వ్యయంతో 6 అడుగుల మేర కట్టను ఎత్తు పెంచి అలుగుపై 13 గేట్లు నిర్మించారు. దీంతో ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 32.6 అడుగులకు చేరగా.. నీటి నిల్వ సామర్థ్యం 2.27 టీఎంసీలకు పెరిగింది. ఆయకట్టు కుడి కాల్వ కింద 9 వేల ఎకరాలు, ఎడమ కాల్వ కింద 3 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తూ వచ్చారు. 2006లో అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా రూ.359 కోట్లతో కోయిల్‌సాగర్‌ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. ప్రాజెక్టు ఆయకట్టును 50,250 ఎకరాలకు పెంచుతూ జూరాల నుంచి కృష్ణాజలాలను కోయిల్‌సాగర్‌కు అందించే విధంగా రూపకల్పన చేశారు. 5 ఏళ్లలో పూర్తి కావాల్సిన పనులు 10 ఏళ్ల తర్వాత పూర్తి కావడంతో నిర్మాణ వ్యయం రూ.450 కోట్లకు పెరిగింది. ప్రస్తుతం జూరాల నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా ప్రాజెక్టుకు నీటిని అందిస్తున్నారు.

నెరవేరని లక్ష్యం..

ఆయకట్టు లక్ష్యం 50,250 ఎకరాలు ఉండగా.. డిస్ట్రిబ్యూటరీ కాల్వలు పూర్తి స్థాయిలో నిర్మించకపోవడంతో సాగు లక్ష్యం నేరవేరడం లేదు. వానాకాలంలో మూడు నెలల పాటు కాల్వల్లో నీరు వదిలితే 35 వేల ఎకరాల మేర సాగవుతుంది. ఇక ప్రాజెక్టులో మిగిలిన నీటితో యాసంగిలో కేవలం 12 వేల ఎకరాలకు కుదించారు.

చెక్కు చెదరని ప్రాజెక్టు

నిజాం ప్రభుత్వ హయాంలో 1947–54 మధ్య నిర్మాణం పూర్తి చేసుకున్న కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టు నేటికీ చెక్కు చెదరని స్థితిలో ఉంది. కోయిలకొండ కోట సమీపంలో ఉండడం వల్ల ప్రాజెక్టుకు కోయిల్‌సాగర్‌ అని పేరు పెట్టారు. 10 జూలై 1954లో అప్పటి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కేఎం ఖర్జు ప్రాజెక్టును ప్రారంభించి ఆయకట్టుకు నీటిని వదిలారు. ప్రాజెక్టు నిర్మాణం వల్ల చిన్నబొల్లారం, పెద్ద బొల్లారం మరో రెండు చిన్న గ్రామా లు నీటిలో మునిగిపోయాయి. వారు ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో ఇళ్లను నిర్మించుకోవడంతో కొత్తగా బొల్లారం పేరుతో గ్రామం ఏర్పడింది.

తాగు, సాగునీరు..

కోయిల్‌సాగర్‌ నుంచి పాలమూర్‌, నారాయణపేట, కొడంగల్‌ ప్రాంతానికి తాగునీటి అందిస్తున్నారు. దేవరకద్ర, చిన్నచింతకుంట, నారాయణపేట నియోజకవర్గంలోని మరికల్‌, ధన్వాడ మండలాలకు, మక్తల్‌ నియోజకవర్గంలోని నర్వ, అమరచింత మండలాల పరిధిలోని కొన్ని గ్రామాలకు సాగునీరు అందుతుంది. అలాగే ప్రాజెక్టు నుంచి గొలుసు కట్టు చెరువులను నింపుతున్నారు. ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌ నుంచి గ్రావిటీ కెనాల్‌ నిర్మాణంతో 11 గ్రామాలకు సాగునీటిని అందించడానికి ఏర్పాట్లు చేశారు.

పర్యాటక కేంద్రం రూపకల్పన నమూనాలు పరిశీలిస్తున్న ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి (ఫైల్‌)

నిజాం కాలంలోనే శంకుస్థాపన

Advertisement
 
Advertisement
Advertisement