పలు అంశాల్లో విద్యార్థులకు శిక్షణా తరగతులు
తల్లిదండ్రుల ప్రోత్సాహం..
తల్లిదండ్రుల ప్రోత్సాహం..
● ఈ నెల 25 వరకు కొనసాగింపు
● సద్వినియోగం చేసుకుంటున్న
విద్యార్థినులు
కందనూలు: కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో చదువుతున్న విద్యార్థినులు తమ కళానైపుణ్యం పెంపొందించుకోవడానికి అనువుగా ప్రభుత్వం వేసవి శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేసి పలు అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. ఇన్ని రోజులు పుస్తకాలతో కుస్తీ పడుతూ మార్కులు సాధించడంలో నిమగ్నమైన బాలికలు ఇప్పుడు తన కళా నైపుణ్యానికి పదును పెడుతున్నారు. జిల్లాలో 20 కేజీబీవీలు ఉండగా.. కొల్లాపూర్ కేజీబీవీలో విద్యార్థునులకు శిక్షణ తరగతులను ఏర్పాటు చేశారు. శిబిరాలు ఈ నెల 11న ప్రారంభించగా ఈ నెల 25 వరకు కొనసాగనుంది. ఇందుకోసం ప్రత్యేక శిక్షకులను నియమించారు. కేంద్రాల్లో విద్యార్థులకు భోజనంతో పాటు వసతి సౌకర్యం కల్పించారు.
ఉదయం నుంచి..
సమ్మర్ క్యాంపులో విద్యార్థినులకు యోగా, స్పీడ్ మ్యాథ్స్, సంగీతం, నృత్యం, మ్యూజిక్, కంప్యూటర్ డీ కోండింగ్, చిత్రలేఖనం, స్పోకెన్ ఇంగ్లిష్‌తో పాటు వివిధ ఆటలు నేర్పిస్తున్నారు. శారీరక, మానసిక, సాంస్కృతిక విలువలతో కూడిన శిక్షణ ఇస్తుండడంతో వారిలో ఉత్సాహం నింపుతుంది. ఉదయం 6.30 నుంచి 7.30 గంటల వరకు యోగా, 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వివిధ అంశాలు, సాయంత్రం క్రీడల్లో శిక్షణ పొందుతున్నారు. జిల్లాలోని కేజీబీవీల్లో చదువుతున్న 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులు 125 మంది సమ్మర్ క్యాంపులో శిక్షణ పొందుతున్నారు.
వేసవి సెలవుల్లో విద్యార్థినులు ఇంటి వద్ద సెల్‌ఫోన్, టీవీలు చూస్తూ తమ సమయాన్ని వృథా చేస్తుంటారు. ఇలాంటి సందర్భంలో కేజీబీవీల్లో చదివే విద్యార్థునులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి సమ్మర్ క్యాంపులు ఎంతో ఉపయోగపడనున్నాయి. తల్లిదండ్రులు సైతం విద్యార్థినులను ప్రోత్సహిస్తూ వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేలా చూస్తున్నారు.


