మినీ ట్యాంక్‌బండ్‌గా ఊరచెరువు | - | Sakshi
Sakshi News home page

మినీ ట్యాంక్‌బండ్‌గా ఊరచెరువు

Mar 22 2026 5:49 AM | Updated on Mar 22 2026 5:49 AM

రూ.కోటి11లక్షలతో అభివృద్ధి పనులు

శంకుస్థాపన చేసిన ఎంపీ అరుణ, ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి

హర్షం వ్యక్తం చేస్తున్న పాతబజార్‌ వాసులు

జడ్చర్ల టౌన్‌: మున్సిపాలిటీ పరిధిలోని పాతబజార్‌ పోచమ్మ ఆలయానికి ఆనుకుని ఉన్న ఊరచెరువుకు మహార్దశ పట్టనుంది. అమృత్‌ 2.0, రాష్ట్ర ప్రభుత్వం, యూఎల్‌బీ సంయుక్త నిధుల ద్వారా చెరువును మినిట్యాంక్‌బండ్‌గా మార్చేందుకు రూ.కోటి11లక్షలు కేటాయించారు. ఈ నిధులకు సంబంధించి శనివారం మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మున్సిపాలిటీ పరిధిలో పోచమ్మ ఆలయం వద్ద ఉన్న ఊరచెరువును పరిరక్షించేందుకు కొన్నేళ్లుగా పోరాటాలు జరిగాయి. దశాబ్దం కిందట చెరువులో ప్లాట్లు వెలియడంతో పాతబజార్‌వాసులు ప్రస్తుత కౌన్సిలర్‌ ఉమాశంకర్‌గౌడ్‌, జీనురాల సత్యంతోపాటు మరికొందరు పరిరక్షణ కమిటీగా ఏర్పడి ఆందోళనలు చేశారు. చెరువులో ప్లాట్లు చేయడం వల్ల భూగర్భజలాలు అడుగంటిపోతాయని ఆందోళనలు చేశారు. వీరికి స్థానికుల నుంచి మద్దతు లభించింది. ఆ నేపథ్యంలోనే అప్పటి కలెక్టర్‌ ప్రియదర్శిని చెరువును సందర్శించి ఇరిగేషన్‌ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి కట్టను పునఃరుద్ధరింపజేశారు. అప్పటినుంచి ఏదో సందర్భంలో చెరువు సమస్య వివాదం నడుస్తూనే ఉంది. ఇటీవల వరదనీటి కాల్వల నిర్మాణం చేస్తున్న సమయంలో అలుగునీరు వెళ్లే ప్రాంతంలో కాలువ నిర్మాణం చేయకుండా కొందరు తమ ప్లాట్లు ఉన్నాయని అడ్డుకున్నారు. అయితే ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి కాల్వ నిర్మాణం వైపు మొగ్గుచూపటంతో సమస్య సద్దుమణిగింది.

పాతబజార్‌ వాసుల హర్షం

ఊరచెరువును మినీట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేస్తుండటంపై పాతబజార్‌ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పోచమ్మ ఆలయం వద్ద చెరువు మురుగు లేకుండా శుభ్రం అవుతుందని, నిధులు కేటాయించినందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

అభివృద్దే లక్ష్యంగా..

అభివృద్ధే లక్ష్యంగా అన్ని మున్సిపాలిటీల అభివృద్ధికి అమృత్‌ ద్వారా కేంద్రం నిధులు కేటాయిస్తుందని, దానికి తోడు రాష్ట్ర ప్రభుత్వం సైతం నిధులు కేటాయించింది. అందులో భాగంగానే ఊరచెరువు మినీ ట్యాంక్‌బండ్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. రూ.45కోట్లతో జడ్చర్ల మున్సిపల్‌లో నీటి సమస్య పరిష్కారానికి నిధులు కేటాయించాం. పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. త్వరితగతిన పూర్తిచేయాలని కాంట్రాక్టర్‌కు చెప్పాం.

– డీకే అరుణ, పార్లమెంట్‌సభ్యురాలు.

అభివృద్ధికి కట్టుబడి ఉన్నా

నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను. అందులో భాగంగానే మున్సిపాలిటీ పరిధిలో ఇప్పటికే రూ.14కోట్లతో వరద కాలువలు నిర్మించుకుంటున్నాం. ఇప్పుడు కేంద్ర సహకారంతో ఊరచెరువు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకున్నాం. త్వరలోనే మరిన్ని నిధులు తెచ్చి మున్సిపాలిటీని ముందుకు తీసుకువెళ్తా. – అనిరుధ్‌రెడ్డి, ఎమ్మెల్యే, జడ్చర్ల

మినీట్యాంక్‌బండ్‌

ఊర చెరువు మినీట్యాంక్‌ బండ్‌గా మార్చాలని అనేక ఏళ్లుగా ప్రతిపాదనలున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో మినీట్యాంక్‌ బండ్‌ ఏర్పాటుకు నిధులు విడుదలయ్యాయి. అమృత్‌ 2.0లో రూ.45లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.45లక్షలు, యూఎల్‌బీ నిధులు 21లక్షలు కేటాయించారు. శంకుస్థాపన కార్యక్రమంలో మున్సిపల్‌ పాలకవర్గం, ఆయాపార్టీల నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement