● రూ.2 కోట్లతో అభివృద్ది పనులు ప్రారంభించిన మంత్రి జూపల్లి కృష్ణారావు
చారకొండ: రాష్ట్రంలో అపర భద్రాద్రిగా ప్రసిద్ధిగాంచిన సిర్సనగండ్ల సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధికి పెద్దపీట వేసి మరిన్ని నిధులతో అన్నిరకాలుగా అభివృద్ధి చేసి ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం మండలంలోని సిర్సనగండ్ల సీతారామచంద్రస్వామి ఆలయ ఆవరణలో రూ.2 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి మంత్రి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. అంతకు ముందు సీతారామచంద్రస్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పాలక మండలి ఆధ్వర్యంలో మంత్రి, ఎమ్మెల్యేలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి గతంలో ఇచ్చిన హామీ మేరకు రూ.2 కోట్లు మంజూరు చేశామని, త్వరలోనే మరో రూ.కోటి మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ ప్రజాపాలనలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు సహకారంతో ఆలయం మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. త్వరలో జరిగే బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్నిరకాల వసతులు కల్పిస్తామని చెప్పారు. అనంతరం బ్రహ్మోత్సవాల వాల్‌పోస్టర్‌ను మంత్రి, ఎమ్మెల్యేలు ఆవిష్కరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఉమ, ఆలయ కమిటీ చైర్మన్ డేరం రామశర్మ, ఈఓ ఆంజనేయులు, సర్పంచ్ రామస్వామి, ఉపసర్పంచ్ సురేందర్‌రెడ్డి, నాయకులు బాల్‌రాంగౌడ్, వెంకట్‌గౌడ్, వెంకటయ్యయాదవ్, జైపాల్, గణేష్‌గౌడ్, వెంకటయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.


