వటువర్లపల్లి రీలొకేషన్‌కు అనుమతి | - | Sakshi
Sakshi News home page

వటువర్లపల్లి రీలొకేషన్‌కు అనుమతి

Mar 22 2026 5:49 AM | Updated on Mar 22 2026 5:49 AM

మన్ననూర్‌/అమ్రాబాద్‌: అటవీ సరిహద్దు ప్రాంత గ్రామాల పునరావాసంలో భాగంగా రెండవ ఫేజ్‌లో ఉన్న వటువర్లపల్లి గ్రామాన్ని తరలించేందుకు కేంద్రం అనుమతులు ఇచ్చినట్లు రాష్ట్ర ప్రధాన అటవీ సంరక్షణ అధికారిణి (పీసీసీఎఫ్‌) సువర్ణ తెలిపారు. శనివారం అమ్రాబాద్‌ మండలం వటువర్లపల్లి నుంచి పునరావాసం కోరుకునే లబ్ధిదారులను అటవీశాఖ అధికారులతో కలిసి ఆమె కలిశారు. గ్రామంలోని ముస్లింలకు రంజాన్‌ శుభాకాంక్షలు తెలియజేసిన అనంతరం రీలొకేషన్‌పై గ్రామస్తులతో చర్చించారు. మొదటి విడతగా సార్లపల్లి, కుడిచింతలబైలు, తాటిగుండాల గ్రామాల్లోని కుటుంబాలకు పూర్తిస్థాయిలో పునరావాసం పనులు ఇదివరకే ప్రారంభమైన విషయాన్ని తెలియజేశారు. రెండవ విడతలో వటువర్లపల్లిలోని సుమారు 670 కుటుంబాలకు పునరావాసం ప్యాకేజీ కేటాయించనున్నట్లు వివరించారు. పులు ల రక్షిత అభయారణ్యంలో జన సంచారం ఉండకూడదనే నిబంధనలను అనుసరిస్తూ.. పునరావాసం అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. అదే విధంగా అంతర్జాతీయ అటవీ దినోత్సవంలో భాగంగా మద్దిమడుగు రేంజ్‌ పరిధిలోని చింతలమట్ట, సోమచెల్క, ఇసుక రేగడి, గద్దలసరి, మన్ననూర్‌ రేంజ్‌ పరిధిలోని గుండం, పర్హాబాద్‌ వ్యూ పాయింట్‌ ప్రాంతాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ పార్క్‌ నుంచి విడిచిన 60 మచ్చలజింకలను పరిశీలించారు. రివర్‌ పెట్రోలింగ్‌, అటవీ సంరక్షణపై తీసుకుంటున్న చర్యలను సిబ్బందితో తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎఫ్‌డీ సునీల్‌, డీఎఫ్‌ఓ రోహిత్‌ చంద్ర, ఎఫ్‌డీఓ రామ్మూర్తి, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ ఎఫ్‌డీఓ రామ్మోహన్‌, ఎఫ్‌ఆర్‌ఓ వీరేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement