మిడ్జిల్: కారు బైకును ఢీకొట్టిన ప్రమాదంలో బైకుపై ఉన్న వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని రాణిపేట్ గ్రామానికి చెందిన బోయ మల్లేశ్(31) బైకుపై జడ్చర్ల వెళ్లి ఇంటికి వస్తుండగా మార్గ మధ్యలో కొత్తపల్లి గ్రామ శివారులో కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఎస్‌ఐ శివనాగేశ్వర్‌నాయుడు సంఘటనా స్థలానికి చేరుకొని మల్లేశ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జడ్చర్ల ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య రేణుక, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. రేణుక రాణిపేట్ గ్రామ పంచాయతీ వార్డు సభ్యురాలుగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలుపొందారు.
బైక్ అదుపుతప్పి
యువకుడి మృతి
కోస్గి రూరల్: అత్తగారింటికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తుండగా ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం చోటు చేసుకుంది. పోలీసులు కథనం మేరకు.. వికారాబాద్ జిల్లాలోని దుద్యాల మండలంలోని కుదురుమళ్ల గ్రామానికి చెందిన దేవరకొండ భీమానందం (35)కు ఇద్దరు భార్యలు. పట్టణానికి చెందిన మహిళను వివాహం చేసుకోగా ఆమెకు కుమార్తె ఉన్నారు. అనంతరం ఈర్లపల్లి గ్రామానికి చెందిన సంగీతను రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఈ క్రమంలో ఉగాది పండుగను పురస్కరించుకొని రెండో భార్య సంగీత గ్రామమైన ఈర్లపల్లికి వెళ్లాడు. తిరిగి శుక్రవారం అర్ధరాత్రి కోస్గి బయలుదేరగా.. మార్గమధ్యలో సర్జఖాన్‌పేట్ గ్రామ శివారులోని బ్రిడ్జి సమీపంలో బైక్ అదుపు తప్పి కిందపడటంతో తలకు బలమైన గాయమై తీవ్ర రక్తస్రావమైంది. వాహనదారులు గమనించి 108 వాహనానికి సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకోని క్షతగాత్రుడిని కోస్గి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. రెండో భార్య సంగీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని ఎస్‌ఐ బాల్‌రాజ్ తెలిపారు. శనివారం పోస్టుమార్టం ఆనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అందించగా.. సొంత గ్రామమైన కుదురుమళ్లలో అంతక్రియలు చేపట్టారు.
నీరు తాగేందుకు వెళ్లి బావిలో పడి వ్యక్తి మృతి
కొత్తకోట రూరల్: నీరు తాగేందుకు బావి దగ్గరకు వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెందిన ఘటన మండలంలోని నాటవెళ్లి పెద్దతండాలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, తండావాసులు తెలిపిన వివరాల మేరకు నాటవెళ్లిపెద్దతండాకు చెందిన ముడావత్ బుజ్జినాయక్ (58) తన మేకలను మేత కోసం శుక్రవారం ఉదయం తండా శివారులోని పొలాల్లోకి వెళ్లాడు. సాయంత్రమే మేకలు ఇంటికి వచ్చినా.. బుజ్జినాయక్ మాత్రం రాత్రయిన ఇంటికి రాలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు శనివారం ఉదయం వెతకగా.. గ్రామ శివారులోని ఓ బావి వద్ద నీళ్ల బిందె, చెప్పులు కనిపించడంతో గ్రామస్తులతో కలిసి బావికి రెండు మోటార్లను బిగించి నీటికి బయటకు తోడారు. దీంతో బావిలో బుజ్జినాయక్ మృతదేహం లభ్యమైంది. నీళ్లు తాగేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు కాలుజారి బావిలో పడి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బుజ్జినాయక్ మృతితో తండాలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు.
రోడ్డుప్రమాదంలో
బాలుడి దుర్మరణ ం
● మరో బాలుడికి తీవ్ర గాయాలు
మరికల్: కారు ఢీకొని ఓ బాలుడు మృతిచెందగా.. మరో బాలుడికి తీవ్ర గాయాలైన ఘటన శనివారం మరికల్ శివారులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మరికల్‌కు చెందిన సాయినాథ్‌రెడ్డి, మరో బాలుడు రిషివర్ధన్‌రెడ్డి బైక్‌పై పొలానికి వెళ్తుండగా.. ఆత్మకూర్–కన్మనూర్ క్రాసింగ్ వద్దకు రాగానే మరికల్ నుంచి ఆత్మకూర్ వైపు వేగంగా వచ్చిన కారు బైక్‌ను ఢీకొట్టింది. కారు మూడు పల్టీలు కొట్టి నిలిచిపోయింది. అదే సమయంలో అక్కడి నుంచి వస్తున్న ఎస్‌ఐ రాము ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఇద్దరు పిల్లలను అంబులైన్స్‌లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. రిషివర్ధన్‌రెడ్డి పరి స్థితి పూర్తిగా విషమించడంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో తల్లిదండ్రుల రోదనలు కన్నీళ్లు తెప్పిస్తున్నా యి. కారులో బెలున్స్ ఓపెన్ కావడంతో డ్రైవర్ సాయికిరణ్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాము తెలిపారు.


