ప్రారంభమైన కందుల కొనుగోళ్లు
● అందుబాటులోకి తూర్పార పట్టే
యంత్రాలు
● ‘సాక్షి’కి ధన్యవాదాలు తెలిపిన రైతులు
గండేడ్: కందుల కొనుగోళ్లలో నిర్లక్ష్యంపై సాక్షి లో వచ్చిన వరుస కథనాలకు అధికారులు స్పందించారు. రైతుల కష్టాలను వివరిస్తూ గురువారం సాక్షిలో ‘కంది రైతుల కష్టాలు’ అనే శీర్షికతో కథనం ప్రచురితం కావడంతో అధికారులు స్పందించి మండల కేంద్రంలోని పీఏసీఎస్ ఆధ్వర్యంలో గురువారం కందుల కొనుగోళ్లను ప్రారంభించారు. ఉదయమే హమాలీలతో కందులు తూకం వేయడం ప్రారంభించారు. తూర్పు పట్టే యంత్రాన్ని కూడ తీసుకురావడంతో ఓవైపు రైతులు కందుల తూర్పు పడుతుండగా మరోవైపు హమాలీలు కందులు తూకం వేశారు.
తూర్పార యంత్రం ఏర్పాటు
మిల్లెట్ యూనిట్ సమీపంలో ఏర్పాటు చేసిన ఐకేపీ కొనుగోలు కేంద్రంలో తూర్పు పట్టే యంత్రాన్ని అందుబాటులోకి తెచ్చారు. గత సోమ వారం వరకు 853 క్వింటాళ్ల కందులు కొనుగోలు చేసి గోదాంకు పంపించారు. వీటిలో 71 బ్యాగులు బుర్రలు, దుమ్ము, తాలు అంటూ గోదాం నుంచి తిప్పి పంపించారు. కాగా ఈ విషయాన్ని మంగళవారం ‘కందులు రిటర్న్’ అన్న శీర్షికతో కథనం ప్రచురితమైంది. తూర్పు పట్టే యంత్రం లేకపోవడంతో రైతులు చేతులతో తూర్పు పట్టారు. దీంతో కందులు బాగాలేవంటూ కొనుగోలు కేంద్రానికి తిప్పి పంపించారు. దీనిపై కూడా కథనం రావడంతో అధికారులు ఎట్టకేలకు స్పందించారు. ఏపీఎం రజిత ఉన్నతాధికారులతో మాట్లాడి తూర్పు పట్టే యంత్రాన్ని తెప్పించారు. దీంతో ఇప్పటి వరకు దాదాపు 1500 క్వింటాళ్లకు పైగా కందులు కొనుగోలు చేసి గోదాంకు తరలించారు.
సాక్షికి రైతుల ధన్యవాదాలు
పీఏసీఎస్, ఐకేపీ కేంద్రాల్లో సమస్యలను గుర్తించి కందుల కొనుగోళ్లు సవ్యంగా సాగేలా వరుస కథనాలు ప్రచురించిన సాక్షి దినప్రతికకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పత్రికల్లో కథనాలు రాకపోతే తాము మరింత ఇబ్బందులు పడేవారమని రైతులు పేర్కొన్నారు. తమ గోడు విని సమస్య పరిష్కారానికి కృషి చేసినందుకు ఆనందం వ్యక్తం చేశారు.
ప్రారంభమైన కందుల కొనుగోళ్లు
ప్రారంభమైన కందుల కొనుగోళ్లు


