చాంపియన్ పాలమూరు
బాలుర, బాలికల విభాగాల్లో విజేతగా జిల్లా జట్లు
● ముగిసిన రాష్ట్రస్థాయి
ఎస్‌జీఎఫ్ అండర్– 19 టోర్నీ
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లా కేంద్రంలో ఆదివారం ముగిసిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ 69వ రాష్ట్రస్థాయి అండర్– 19 హ్యాండ్‌బాల్ టోర్నమెంట్‌లో బాల, బాలికల విభాగాల్లో ఆతిథ్య ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా జట్లు సత్తా చాటి చాంపియన్‌గా నిలిచాయి. టోర్నీలో మొదటి నుంచి మెరుగైన ప్రతిభ కనబర్చిన జిల్లా జట్లు ఫైనల్‌లో కూడా అదేస్థాయిలో రాణించి చాంపియన్‌షిప్ కై వసం చేసుకున్నాయి.
ఉత్కంఠ పోరులో విజయం
బాలుర విభాగంలో మహబూబ్‌నగర్ హైస్కూల్ మైదానంలో ఉత్కంఠంగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో మహబూబ్‌నగర్ జిల్లా జట్టు 11– 7 గోల్స్ తేడాతో వరంగల్ జట్టుపై విజయం సాధించింది. బాలుర విభాగంలో మూడో స్థానంలో కరీంనగర్ జట్టు నిలిచింది. బాలికల విభాగం ఫైనల్ మ్యాచ్‌లో మహబూబ్‌నగర్ జట్టు 9– 5 గోల్స్ తేడాతో వరంగల్ జట్టుపై గెలుపొందింది. మూడో స్థానంలో ఖమ్మం జట్టు నిలిచింది.
విజేత జట్లకు బహుమతుల ప్రదానం
టోర్నీ విన్నర్, రన్నరప్, థర్డ్‌ప్లేస్ జట్లకు ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు ఎన్‌పీ.వెంకటేశ్, ప్రముఖ పారిశ్రామికవేత్త బెక్కరి రాంరెడ్డి తదితరులు ట్రోఫీలు అందజేశారు. ఈ సందర్భంగా ఎన్‌పీ వెంకటేశ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తుందన్నారు. గ్రామీణ స్థాయి నుంచి క్రీడలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా క్రీడాకారుడు అయినందున క్రీడా రంగం అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రెండేళ్ల నుంచి మహబూబ్‌నగర్‌లో ఎన్నో రాష్ట్రస్థాయి క్రీడా టోర్నీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పారిశ్రామికవేత్త బెక్కరి రాంరెడ్డి మాట్లాడుతూ.. చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. క్రీడాకారుల్లో క్రమశిక్షణ చాలా ముఖ్యమన్నారు. ఓడిన వారు నిరాశ చెందకుండా గెలుపు కోసం శ్రమించాలని పేర్కొన్నారు.టోర్నీ రాష్ట్ర పరిశీలకులు శ్రీనివాస్, పుల్లయ్య, జిల్లా ఎస్‌జీఎఫ్ కార్య నిర్వాహక కార్యదర్శి డాక్టర్ శారదాబాయి, రజనీకాంత్‌రెడ్డి, ఎండీ.జియవుద్దీన్, బాల్‌రాజు, అహ్మద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.


