1, 2, 3, 4 ఓట్ల మెజార్టీతో విజయం
నారాయణపేట జిల్లాలో నలుగురిని వరించిన అదృష్ట
నారాయణపేట: రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుల మధ్య జరిగిన హోరాహోరీ పోరులో నలుగురు అభ్యర్థులు ఒకటి, రెండు, మూడు, నాలుగు ఓట్ల మెజార్టీతో గట్టెక్కారు. దీన్ని సమీప ప్రత్యర్థి అభ్యర్థులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంకా కొంత కష్టపడితే విజయం తమదే అయ్యేదంటూ తలపట్టుకుంటున్నారు. ఆ ఒకటి, రెండు, మూడు, నాలుగు ఓట్లు చివరగా వేసిన ఓటర్లు ఏవరోనంటూ చర్చించుకుంటున్నారు. కాగా, వరుసగా ఒకటి, రెండు, మూడు ఓట్ల తేడాతో విజయం సాధించిన అభ్యర్థులు కాంగ్రెస్ మద్దతుదారులే కావడం విశేషం. నాలుగు ఓట్ల తేడాతో సీపీఐ పార్టీకి చెందిన అభ్యర్థి గెలుపొందడం చర్చనీయాంశంగా మారింది. నారాయణపేట జిల్లాలో 1, 2, 3, 4 ఓట్లతో విజయం సాధించిన సర్పంచుల వివరాలిలా ఉన్నాయి.
ఒక్క ఓటుతో తిరుపతమ్మ గెలుపు..
మరికల్ మండలం పెద్దచింతకుంటలో ఒక్క ఓటుతో కాంగ్రెస్ మద్దతుదారు తిరుపతమ్మ విజయం సాధించారు. (రీ కౌంటింగ్ చేసినా విజయం ఆమెనే వరించింది.) ఆ గ్రామ పంచాయతీ ఎస్సీ మహిళకు రిజర్వు కాగా.. బీఆర్‌ఎస్ మద్దతుదారు పద్మకు 604 ఓట్లు, కాంగ్రెస్ మద్దతుదారు తిరుపతమ్మకు 605 ఓట్లు వచ్చాయి. ఒకే ఒక్క ఓటు అధికంగా రావడంతో తిరుపతమ్మను అదృష్టం వరించినట్లయింది.
రెండు ఓట్లతో కేతావత్ మంగ..
ధన్వాడ మండలం మడిగేలా తండా జీపీలో ఎస్టీ మహిళా రిజర్వేషన్‌లో పోటీపడిన కాంగ్రెస్ మద్దతుదారు కేతావత్ మంగకు 343 ఓట్లు రాగా.. సమీప అభ్యర్థి గీతకు 341 ఓట్లు పోలయ్యాయి. అయితే 2 ఓట్ల ఆధిక్యంతో కేతావత్ మంగ విజయం సాధించారు.
మూడు ఓట్లతో రాందాస్ నాయక్..
ధన్వాడ మండలం తోళ్లగుట్టతండా జీపీ ఎస్టీ జనరల్‌కు రిజర్వు అయింది. ఇక్కడ కాంగ్రెస్ మద్దతుదారు రాందాస్‌నాయక్‌కు 200 ఓట్లు రాగా.. సమీప అభ్యర్థి బీజేపీ మద్దతుదారు పాండునాయక్‌కు 197 ఓట్లు వచ్చాయి. 3 ఓట్ల తేడాతో రాందాస్ సర్పంచ్ కుర్చీని కై వసం చేసుకున్నారు.
నాలుగు ఓట్లతో పేరప్ప..
ధన్వాడ మండలం పాతపల్లి జీపీ జనరల్‌కు రిజర్వు అయింది. అక్కడ సీపీఐ మద్దతుదారు పేరప్ప 4 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. పేరప్పకు 511 ఓట్లు రాగా.. ప్రత్యర్థి బీజేపీ మద్దతుదారుకు 507 ఓట్లు వచ్చాయి.


