కందనూలులో హోరాహోరీ
సాక్షి, నాగర్‌కర్నూల్: జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. మొత్తం 151 సర్పంచ్ స్థానాలకు గాను కాంగ్రెస్ మద్దతుదారులు 78 చోట్ల గెలుపొందగా, బీఆర్‌ఎస్ మద్దతుదారులు 60 సర్పంచ్ స్థానాల్లో గెలుపొందారు. రెండో విడతలో బీఆర్‌ఎస్ దాదాపుగా అన్నిచోట్ల బలమైన పోటీనిచ్చింది. అంతిమంగా కాంగ్రెస్ స్వల్ప ఆధిపత్యం ప్రదర్శించినా పెద్దకొత్తపల్లి మండలం మినహా మిగిలిన ఆరు మండలాల్లో బీఆర్‌ఎస్ మద్దతుదారులు సత్తాచాటారు. మరో ఆరు చోట్ల బీజేపీ, ఏడు చోట్ల స్వతంత్రులు గెలుపొందారు.
బీఆర్‌ఎస్‌కే 13 స్థానాలు..
మలి విడత పంచాయతీ పోరులో కాంగ్రెస్‌కు చేరువగా బీఆర్‌ఎస్ సైతం సర్పంచ్ స్థానాలను కై వసం చేసుకోవడం గమనార్హం. తిమ్మాజిపేట మండలంలో మొత్తం 26 గ్రామ పంచాయతీలు ఉండగా.. ఇందులో కాంగ్రెస్ 11 సర్పంచ్ స్థానాలు గెలుచుకుంటే బీఆర్‌ఎస్ 13 స్థానాలను సొంతం చేసుకుంది. బిజినేపల్లి మండలంలో 35 సర్పంచ్ స్థానాలకు గాను కాంగ్రెస్ 18, బీఆర్‌ఎస్ 14 స్థానాలను గెలుచుకున్నాయి. ఇక్కడ బీజేపీ మూడు సర్పంచ్ స్థానాలను కై వసం చేసుకుంది. పెంట్లవెల్లి మండలంలో 10 సర్పంచ్ స్థానాల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఐదేసి చొప్పున స్థానాల్లో గెలుచుకున్నాయి. కోడేరులో మొత్తం 16 స్థానాలకు కాంగ్రెస్ 7, బీఆర్‌ఎస్ మద్దతుదారులు 5 స్థానాల్లో గెలిచారు. కొల్లాపూర్‌లో మొత్తం 18 స్థానాలకు 10 కాంగ్రెస్, 7 స్థానాలను బీఆర్‌ఎస్ మద్దతుదారులు గెలుచుకున్నారు.
చేజారిన సర్పంచ్ పీఠం..
రెండో విడత ఎన్నికల్లో చాలాచోట్ల అభ్యర్థులు అతితక్కువ ఓట్ల తేడాతో విజయం సాధించారు. జిల్లాలోని తిమ్మాజిపేట మండలం వెంకాయపల్లిలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మద్దతుదారులకు ఇద్దరికీ సమానంగా 236 ఓట్లు వచ్చాయి. రీకౌంటింగ్ నిర్వహించినా ఒకే ఫలితం వచ్చింది. దీంతో టాస్ వేయగా కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించడంతో గెలిచినట్లుగా ప్రకటించారు. పెద్దకొత్తపల్లి మండలం దేవినేనిపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి గౌస్ 4 ఓట్ల తేడాతో గెలుపొందారు. సంజీవపురంలో కాంగ్రెస్ అభ్యర్థి 7 ఓట్ల తేడాతో విజయం సాధించారు. చంద్రబండతండాలో అభ్యర్థి చిట్టి 15 ఓట్లతో గెలిచారు. సాతాపూర్‌లో బీఆర్‌ఎస్‌కు చెందిన వంశీకృష్ణ 11 ఓట్లతో గెలుపొందగా ఇక్కడ రెండుసార్లు రీకౌంటింగ్ చేశారు. తిమ్మాజిపేట మండలం అప్పాజిపల్లిలో బీఆర్‌ఎస్‌కు చెందిన వెంకటయ్య 11 ఓట్లు, నాగర్‌కర్నూల్ మండలం నల్లవెల్లిలో కాంగ్రెస్‌కు చెందిన వెంకటస్వామి 17 ఓట్ల తేడాతో గెలుపొందారు. కాగా.. జిల్లాలో అత్యధికంగా పెద్దకొత్తపల్లి మండలం పెద్దకార్పాములలో బీఆర్‌ఎస్ మద్దతుదారు చిట్టెమ్మ 1,352 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
రెండో విడతలో పార్టీల వారీగా వచ్చిన సర్పంచ్ స్థానాలు
మండలం జీపీలు కాంగ్రెస్ బీఆర్‌ఎస్ బీజేపీ స్వతంత్రులు
బిజినేపల్లి 35 18 14 3 –
నాగర్‌కర్నూల్ 18 10 8 – –
తిమ్మాజిపేట 26 11 13 – 2
కొల్లాపూర్ 18 10 7 1 –
పెంట్లవెల్లి 10 5 5 – –
కోడేరు 16 7 5 – 4
పెద్దకొత్తపల్లి 28 17 8 2 1
నాగర్‌కర్నూల్ జిల్లాలో కాంగ్రెస్‌కు 78, బీఆర్‌ఎస్‌కు 60 సర్పంచ్ స్థానాలు
తిమ్మాజిపేట మండలంలో బీఆర్‌ఎస్‌కే అధికం
పెద్దకొత్తపల్లి మండలం మినహా అన్నిచోట్ల కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య పోటాపోటీ
స్వల్ప తేడాతో సర్పంచ్‌గిరి కోల్పోయిన అభ్యర్థులు


