మలివిడత పోరు.. ప్రశాంతం
వనపర్తి జిల్లాలో 87 శాతం ఓటింగ్
● రాత్రి 10.30 వరకు కొనసాగిన ఓట్ల లెక్కింపు
● కొత్తకోట మండలం అజ్జకొల్లులో క్లీన్‌స్వీప్ చేసిన బీఆర్‌ఎస్
● కొత్తకోట, ఆత్మకూర్, అమరచింతలో కాంగ్రెస్ హవా..
● వనపర్తి, మదనాపురం మండలాల్లో గట్టిపోటీ ఇచ్చిన
బీఆర్‌ఎస్
● రెండు సర్పంచ్ స్థానాలకు పరిమితమైన బీజేపీ
వనపర్తి: గ్రామపంచాయతీ ఎన్నికల మలివిడత ఘట్టం ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఆత్మకూర్, అమరచింత, కొత్తకోట, మదనాపురం, వనపర్తి మండలాల పరిధిలోని 94 సర్పంచ్, 850 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. 5 సర్పంచ్, 148 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో మిగిలిన 89 సర్పంచ్, 702 వార్డు స్థానాలకు ఆదివారం ఎన్నికలు జరిగాయి. ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్, భోజన విరామ అనంతరం ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టారు. రాత్రి 10.30 వరకు అన్ని గ్రామాల్లో కౌంటింగ్ ప్రక్రియ పూర్తిచేసి ఫలితాలు వెల్లడించారు. కలెక్టర్ వనపర్తి మండలం నాచహళ్లిలో ఏర్పాటు చేసిన ఆదర్శ పోలింగ్ కేంద్రాన్ని, పెద్దగూడెం తదితర గ్రామాల్లో ఓటింగ్ సరళిని పరిశీలించి కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన వెబ్‌కాస్టింగ్ కేంద్రం నుంచి జిల్లాలోని పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఎస్పీ సునీతరెడ్డి చిట్యాల, అచ్యుతాపురం, రాజపేట, కొత్తకోట మండలం కానాయపల్లి, కొత్తకోట తదితర ప్రాంతాల్లో పర్యటించి బందోబస్తును పర్యవేక్షించారు.
వనపర్తి, మదనాపురంలో పోటాపోటీ..
వనపర్తి, మదనాపురం మండలాల్లో అధికార కాంగ్రెస్‌పార్టీకి బీఆర్‌ఎస్ గట్టి పోటీనిచ్చింది. మదనాపురంలో బీఆర్‌ఎస్ మద్దతుదారులు కాంగ్రెస్ కంటే ఎక్కువ చోట్ల సర్పంచ్‌లుగా విజయం సాధించారు. వనపర్తి మండలంలోని 26 గ్రామపంచాయతీల్లో 11 స్థానాల్లో బీఆర్‌ఎస్ బలం చాటుకుంది.
మూడు మండలాల్లో కాంగ్రెస్‌దే ఆధిక్యం..
కొత్తకోట, ఆత్మకూర్, అమరచింత మండలాల్లో అధికార కాంగ్రెస్‌పార్టీ ఆధిక్యం చాటింది. బీఆర్‌ఎస్ ఉనికి చాటుకోగా.. బీజేపీ అమరచింత మండలంలో రెండు సర్పంచ్ స్థానాలకు పరిమితమైంది. స్వతంత్రుల సంఖ్య 9కి చేరింది.
మదనాపురం మండలం అజ్జకొల్లులో సర్పంచ్‌తో పాటు అన్ని వార్డుల్లో బీఆర్‌ఎస్ మద్దతుదారులు విజయభేరీ మోగించారు.
ఆత్మకూర్ మండలం ఆరేపల్లిలో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి రామచంద్రయ్య జిల్లాలోనే అత్యధికంగా 1,180 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
వనపర్తి మండలం కీర్యతండా సర్పంచ్ అభ్యర్థి క్రిష్టియా ఒక ఓటుతో విజయం సాధించింది.


