పోలింగ్ కేంద్రాల్లో పటిష్ట భద్రత
● బందోబస్తు తనిఖీ చేసిన డీఐజీ ఎల్‌ఎస్ చౌహాన్
మహబూబ్‌నగర్ క్రైం: జిల్లావ్యాప్తంగా ఆదివారం జరిగిన రెండో విడత పంచాయతీ ఎన్నికల కోసం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ముగ్గురి నుంచి ఐదుగురికి వరకు బందోబస్తు కేటాయించి ఎన్నికలు ప్రశాంతంగా పూర్తి చేశారు. సమస్యాత్మక గ్రామాలు, కేంద్రాల్లో ప్రత్యేక గస్తీ పెట్టడం, ఎప్పటికప్పుడు నిఘా ఏర్పాటు చేసి సమన్వయంతో విధులు నిర్వహించారు. మొత్తం 1,249 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తూ ఎలాంటి ఘటనలు జరగకుండా చేశారు.
సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టి: డీఐజీ
హన్వాడ మండలం టంకర్ పోలింగ్ కేంద్రాన్ని జోగుళాంబ జోన్–7 డీఐజీ ఎల్‌ఎస్ చౌహాన్, ఎస్పీ డి.జానకి పరిశీలించారు. టంకరలో ఉన్న సమస్యాత్మక పోలింగ్ స్టేషన్స్‌ను డీఐజీ తనిఖీ చేసి భద్రత ఏర్పాట్లు పరిశీలించారు. అనంతరం పోలింగ్‌కేంద్రాల్లో తీసుకుంటున్న చర్యలు, ఓటింగ్ ప్రక్రియ సరళిని ప్రత్యక్షంగా చూశారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ జిల్లాలో సమస్యాత్మకంగా ఉండే కేంద్రాల్లో అదనపు బందోబస్తు ఉండి గస్తీ చేస్తూ పర్యవేక్షణ చేసినట్లు వెల్లడించారు. ఎన్నికల నియమావళి కఠినంగా అమలు చేస్తున్నామని, ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.
● ఎస్పీ డి.జానకి మొదట మిడ్జిల్ మండల కేంద్రంతో పాటు వాల్యాల ఆ తర్వాత హన్వాడ మండలకేంద్రంతో పాటు వేపూర్, టంకర, దేవరకద్ర మండల పరిధిలోని గురకొండ, కోయిలకొండ మండల పరిధిలోని ఇంజమూర్, ఎల్లారెడ్డిపల్లిలో ఉన్న పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు.


