ఓటేసిన 92 ఏళ్ల వృద్ధుడు
గద్వాల: ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం అని చెబుతున్నప్పటికీ చాలా మంది ఓటుహక్కును వినియోగించుకునేందుకు సంశయిస్తుంటారు. అయితే ఆదివారం జరిగిన రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికలో భాగంగా మల్దకల్ మండలం అమరవాయికి చెందిన 92 ఏళ్ల వృద్ధుడు ధర్మారెడ్డి ఓటుహక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చారు. అక్కడే వృద్ధులకు ఏర్పాటు చేసిన వీల్‌చైర్‌లో వృద్ధుడిని ఎన్నికల సిబ్బంది పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లారు. ఈ సమయంలో పోలింగ్ కేంద్రానికి వచ్చిన కలెక్టర్ బీఎం సంతోష్, ఎస్పీ శ్రీనివాసరావు వృద్ధుడు ధర్మారెడ్డితో మాట్లాడారు. ఈ వయసులో కూడా ఓటువేయటానికి వచ్చినందుకు వారు ధర్మారెడ్డిని అభినందించారు.


