ప్రచారం.. ఆర్థిక భారం
● రోజుకు రూ.200 నుంచి రూ.300 చెల్లింపుతో పాటు మద్యం, మాంసాహార విందులు
● జన సమీకరణ, ద్వితీయశ్రేణి నాయకులకు వెచ్చింపు
● ప్రధాన పార్టీల మద్దతుదారులతో పాటు స్వతంత్రులు సైతం
ఖర్చుకు వెనుకాడని వైనం
‘మీ వార్డుకు ఎన్నికల ఖర్చు కింద రూ.10 వేల నుంచి రూ.15 వేల చొప్పున అందుతాయి. వీటితో స్థానికంగా ఖర్చు చూసుకోవాలి. మన అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలి’.
ఇది ప్రస్తుతం పల్లెల్లో కొనసాగుతున్న ఎన్నికల ప్రచార తీరు. ఏ గ్రామంలో చూసినా స్థానిక ఎన్నికల సందడి నెలకొంది. యువత నుంచి మొదలు వృద్ధుల వరకు అందరూ ఎన్నికలు మరి ఏం లేదా? అనే ప్రశ్న సంధిస్తున్నారు. దీంతో అభ్యర్థులు, వారి అనుచరగణం రోజు మద్యం, మాంసాహార విందులు ఏర్పాటు చేస్తున్నారు.
‘నీవు ప్రచారానికి 50 మందిని తీసుకురా.. ఒక్కొక్కరికి రూ.100 అని చెప్పు, కాదంటే రూ.200 వరకు పెంచు. ఉదయం, సాయంత్రం ఇంటింటి ప్రచారం నిర్వహించి వెళ్లాలి. పార్టీ నేతలు వచ్చినప్పుడు జనం లేకుంటే ఇబ్బందిగా ఉంటుంది. ఎంత మందిని తీసుకొస్తే అన్ని డబ్బులు ఇచ్చేస్తాం.’
పాలమూరు: ఉమ్మడి జిల్లాలో మొదటి, రెండోవిడత ఎన్నికలు జరిగే గ్రామాల్లో ప్రచారం జోరందుకుంది. పలు పార్టీల మద్దతుదారులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు, వార్డుసభ్యులు జన సమీకరణ, ద్వితీయ శ్రేణి నాయకులకు డబ్బు వెచ్చించక తప్పని పరిస్థితి. ఎంత అభిమానం ఉన్నా.. ఎంతో కొంత ముట్టచెప్పకపోతే ప్రచారంలో పాల్గొనేందుకు ఆసక్తి చూపడం లేదు. కొందరు ప్రధాన పార్టీల మద్దతుదారులు కూలీలను మాట్లాడుకొని ప్రచారం సాగిస్తున్నారు. వాహన ర్యాలీకి రావాలంటే పెట్రోల్ పోయించాల్సి వస్తోంది. ఇందుకు కీలక నేతలు డబ్బులు పంచాల్సిన పరిస్థితి నెలకొంది. తమ శక్తి సామర్థ్యాలు ప్రదర్శిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు.
● ఉమ్మడి జిల్లాలోని కొన్ని గ్రామాలకు ప్రధాన పార్టీల నుంచి ఖర్చుల నిమిత్తం నగదు అందుతోంది. వార్డుకు ఓటర్ల సంఖ్య ఆధారంగా రూ.10 వేల నుంచి రూ.15 వరకు పంపిస్తున్నారు. గ్రామాల్లో అభ్యర్థుల ప్రచారానికి జనాన్ని సమీకరించేందుకు ప్రత్యేకంగా కొందరిని నియమించుకొని ప్రచారం పూర్తికాగానే డబ్బులు ఇచ్చే ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రచారం ఉదయం, సాయంత్రం ఎక్కువగా కొనసాగుతుండటం రోజువారీ కూలీలతో పాటు కొందరు పేదలకు ఆసరాగా మారింది.


