12వ శతాబ్ధం నాటి విగ్రహాన్ని కాపాడుకోవాలి
లింగాల: నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం చెన్నంపల్లి గ్రామ శివారులోని పురాతన శివాలయం ఎదుట ఉన్న 12వ శతాబ్దానికి చెందిన వినాయక విగ్రహాన్ని ఒక చెట్టు కబళిస్తుందని, చారిత్రక ప్రాధాన్యత గల ఆ విగ్రహాన్ని వెలికితీసి కాపాడుకోవాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్స్ సీఈఓ ఈమని శివనాగిరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన శివాలయాన్ని సందర్శించారు. ఇక్కడి పొలాల్లో ఉన్న శిథిల త్రికూటాలయం ఎదుట 1167వ శతాబ్దం నాటి కందూరు చోళ వంశానికి చెందిన రెండో గోకర్ణుని శాసన శకలం ఉందన్నారు. గోకర్ణుని కుమారుడైన తొండయ్య లింగాల లో విష్ణు, శివ, సూర్యలకు చెందిన త్రికుటాల యం నిర్మించి కృష్ణాతీరంలో ఉన్న సోమేశ్వరాలయానికి లింగాలను దానం చేసినట్లు వివరాలు శాసనంపై ఉన్నాయని చెప్పారు. ఆలయం లోపల 12వ శతాబ్దం నాటి వీరభద్ర, భైరవ, సూర్య విగ్రహాలు, ఆలయం ఎదుట దీప స్తంభం, చెట్టు తొర్రలో వినాయకుడు, పక్కనే భిన్నమైన భద్రకాళి విగ్రహా లు ఉన్నాయని పేర్కొన్నారు. మర్రి చెట్టు కొంత కాలానికి వినాయక విగ్రహాన్ని పూర్తిగా తనలో కలిపేసుకుటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో ప్రాశస్త్యం, విలువైన విగ్రహం కనుమరుగు కాకుండా కాపాడుకునే బాధ్యత ప్రజలపై ఉందన్నారు.


