బావిలో మొసలి కలకలం
మాగనూర్: మండలంలోని వర్కూర్ సమీపంలో ఉన్న ఊరబావిలో మొసలి కలకలం రేపింది. ఆదివారం మధ్యాహ్నం ప్రాంతంలో మొసలి నీటిమీదకు వచ్చి కనిపించడంతో చూసిన యువకులు భయభ్రాంతులకు గురయ్యారు. బావిలో నీరు చాలా తక్కువగా ఉన్నాయని ఫారెస్టు అధికారులు మొసలిని బంధించి మరో చోటుకు తరలించాలని గ్రామస్తులు కోరతున్నారు. ఈ విషయంపై జిల్లా ఫారెస్టు అధికారి కమలుద్దీన్‌ను సంప్రదించగా.. మొసలి ఉన్న విషయం గ్రామస్తుల ద్వారా తమ దృష్టికి వచ్చిందని.. బావిని కూడా సందర్శించాం. బావిలో నీరు ఉండడంతో మొసలిని పట్టుకోవడానికి వీలుకావడంలేదు. బావిలో ఉండడంతో ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే బావిలో నీరు తగ్గిన వెంటనే పట్టుకుని ఇతర ప్రాంతాలకు తరలిస్తామని తెలిపారు. అంతవరకు ప్రజలు ఎవరు బావివైపునకు వెళ్లవద్దని సూచించారు.
వేడివేడి చాయ్ ముఖంపై చల్లి దాడి
జడ్చర్ల: టీ హోటల్ దగ్గరకు వెళ్లి చాయ్ అడిగిన వ్యక్తిపై హోటల్ యజమాని ఖేటిల్‌లో వేడిగా ఉన్న దాదాపు 5లీటర్ల చాయ్‌ని ముఖంపై చల్లి ఓ రాడ్‌తో దాడిచేసిన ఘటన శనివారం రాత్రి జడ్చర్ల పట్టణంలో చోటుచేసుంది. సీఐ కమలాకర్ కథనం ప్రకారం.. శనివారం రాత్రి 11గంటలకు శివాజీనగర్‌కు చెందిన ఎండీ సమీర్ సమీపంలోని ఓ చిన్నహోటల్ దగ్గరకు వెళ్లి చాయ్ అడుగగా పాత కక్షలు మనసులో పెట్టుకున్న హోటల్ యజమాని మహ్మద్ నా దగ్గరకు వచ్చి చాయ్ అడుగుతావా అంటూ ఖేటిల్‌లో ఉన్న చాయ్‌ని ముఖంపై చల్లి ఓ రాడ్‌తో దాడి చేసి గాయపరిచాడు. తీవ్రంగా గాయపడిన సమీర్‌ను చుట్టుపక్కల వారు గమనించి ఆస్పత్రికి తరలించారు. ఆదివారం బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.


