విషాదం నింపిన అక్కాచెల్లెళ్ల హత్య
గండేడ్/ కోస్గి: చెల్లెలి కాపురం చక్కదిద్దబోయి మరిది చేతిలో చెల్లెలితోపాటు అక్క హతమైన ఘటన మండలంలోని పగిడ్యాల్, బలభద్రాయిపల్లిలో విషాదం నింపింది. గండేడ్ మండలంలోని పగిడ్యాల్ మాజీ సర్పంచ్ తోక కృష్ణయ్యకు ఇద్దరు కుమార్తెలు. వీరిలో పెద్ద కుమార్తె హనుమమ్మ(40)ను గుండుమాల్ మండలంలోని బలభద్రాయిపల్లికి చెందిన బాలకిష్టయ్యకు ఇచ్చి వివాహం చేశారు. రెండో కుమార్తె అలివేలు(34)ను వికారాబాద్ జిల్లాలోని కుల్కచర్లకు చెందిన యాదయ్యకు ఇచ్చి పెళ్లి చేశారు. అయితే అలివేలు కాపురంలో అనుమానం చిచ్చుపెట్టింది. రెండు, మూడేళ్లుగా భార్యాభర్తల మధ్య కలహాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం అలివేలు అక్క హనుమమ్మకు ఫోన్ చేసి తన కాపురం చక్కదిద్దాలని కోరగా.. ఆమె కుల్కచర్లలోని చెల్లి ఇంటికి వచ్చింది. రెండు రోజులపాటు గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో యాదయ్య భార్య అలివేలు, కుమార్తె శ్రావణితోపాటు వదిన హనుమమ్మపై కొడవలితో దాడి చేసి హతమార్చాడు. పెద్ద కుమార్తెను కూడా చంపడానికి ప్రయత్నించగా ఆమె గాయాలపాలై తప్పించుకొని పారిపోయింది. అనంతరం అతడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అక్కాచెల్లెళ్ల సొంత గ్రామమైన పగిడ్యాల్ విషాదం చోటుచేసుకుంది. వారి తండ్రి కృష్ణయ్య నాలుగేళ్ల క్రితమే మృతి చెందాడు.


