నేడు ఎస్‌ఎల్‌బీసీకి సీఎం రాక
సాక్షి, నాగర్‌కర్నూల్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్ట్ అవుట్ లెట్ టన్నెల్‌ను సందర్శించనున్నారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనులను కొనసాగించేందుకు హెలీకాప్టర్ ద్వారా ఏరియల్ ఎలక్ట్రో మ్యాగ్నటిక్ సర్వేను ప్రారంభించనున్నారు. సోమవారం మధ్యాహ్నం ఒంటిగంటకు నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి సమీపంలోని ఎస్‌ఎల్‌బీసీ అవుట్ లెట్‌కు చేరుకొని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి హెలీకాప్టర్ ద్వారా ఎలక్ట్రో మ్యాగ్నటిక్ సర్వేను పరిశీలిస్తారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ తవ్వకాల్లో భాగంగా గత ఫిబ్రవరి 22న దోమలపెంట ఇన్‌లెట్ వద్ద సొరంగం కుంగి ఘోర ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీబీఎం ద్వారా టన్నెల్ తవ్వకాలకు అవకాశం లేకపోవడంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ అవకాశాలపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా సోమవారం నుంచి ఏరియల్ ఎలక్ట్రో మ్యాగ్నటిక్ సర్వే చేపట్టి టన్నెల్ మార్గంలో సుమారు వెయ్యి మీటర్ల వరకు లోతు వరకు ఉన్న షీర్‌జోన్, జియోఫిజికల్ పరిస్థితులను అంచనా వేయనున్నారు. ఆ తర్వాత టన్నెల్ తవ్వకాలపై నిర్ణ యం తీసుకుంటారు. నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎన్జీఆర్‌ఐ) నిపుణుల ఆధ్వర్యంలో ఏరియల్ సర్వే చేపట్టనున్నారు.
అనుమతి లేకుండా ధర్నాలు చేయరాదు : ఎస్పీ
మహబూబ్‌నగర్ క్రైం: శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకుని జిల్లావ్యాప్తంగా ఈ నెల 30 వరకు పోలీస్ 30 యాక్ట్–1861 అమల్లో ఉంటుందని ఎస్పీ జానకి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ యాక్ట్ అమలు నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, అన్ని రకాల సంఘాల నాయకులు, ప్రజలు పోలీసుల నుంచి ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, ఆందోళనలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు ఏర్పాటు చేయరాదన్నారు. అనుమతి లేకుండా ఏదైనా కార్యక్రమాలు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలోని రాజకీయ నేతలతోపాటు ప్రజా, కుల సంఘాల నాయకులు ప్రతిఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు.
రద్దీ ఏరియాల్లో పటిష్ట నిఘా..
జిల్లాలో గత నెల రోజుల వ్యవధిలో షీటీం విభాగానికి 28 ఫిర్యాదులు వచ్చాయని ఎస్పీ జానకి ఒక ప్రకటనలో తెలిపారు. అదేవిధంగా 23 కౌన్సెలింగ్స్, రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న కేసులు 21, ఎఫ్‌ఐఆర్‌లు 5, ఈ–పెట్టీ కేసులు రెండు, అవగాహన కార్యక్రమాలు 16, హాట్‌స్పాట్ విజిట్స్ 86 చేశామన్నారు. విద్యాసంస్థల్లో ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్, సోషల్ మీడియాలో వేధింపులకు పాల్పడితే డయల్ 100 లేదా 87126 59365 నంబర్‌కు సమాచారం ఇవ్వాలన్నారు. అలాగే ఏహెచ్‌టీయూ విభాగం ఆధ్వర్యంలో 22 అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని, 30 హాట్‌స్పాట్ ప్రాంతాలు సందర్శించినట్లు చెప్పారు. మానవ అక్రమ రవాణా, బాల్య వివాహాలు, బాల కార్మికులు, అవయవాల విక్రయాలపై అవగాహన కల్పించినట్లు వివరించారు.


