కృత్రిమ పాదాల ఉచిత శిబిరం అభినందనీయం
స్టేషన్ మహబూబ్‌నగర్: దివ్యాంగులకు ఉచిత కృత్రిమ పాదాల పంపిణీ కోసం శిబిరం నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలోని ఇండోర్ హాల్‌లో తెలంగాణ అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ విజయపాల్‌రెడ్డి, గుడిగోపురం మట్టారెడ్డి కుటుంబాల ఆర్థిక సహాయంతో ఆదివారం దివ్యాంగులకు ఉచిత కృత్రిమ పాదాల పంపిణీ చేయడానికి నిర్వహించిన ఎంపిక శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో సేవ భావన పెరిగితేనే నిజమైన అభివృద్ధి సాధ్యం అన్నారు. దాదాపు 150 మంది దివ్యాంగులకు కృత్రిమ పాదాలు పంపిణీ చేయడానికి నిర్వాహకులు కొలతలు తీసుకున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి ఆర్థిక సహకారం అందిస్తున్న కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నర్సింహారెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి జరీనాబేగం, నాయకులు సుధాకర్‌రెడ్డి, ప్రశాంత్, సంపత్, ప్రమోద్‌కుమార్, సాంబశివరావు, రంగారావు తదితరులు పాల్గొన్నారు.


