మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్
పాలమూరు: దేశ సమైక్యత కోసం మొక్కవోని దీక్షతో పోరాడిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని ఎంపీ డీకే అరుణ అన్నారు. సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతి (జాతీయ సమైక్యత దినోత్సవం) వేడుకల్లో భాగంగా శుక్రవారం జిల్లాకేంద్రంలో నిర్వహించిన రన్ ఫర్ యూనిటీ కార్యక్రమంలో ఎంపీ ముఖ్య అతిథిగా పాల్గొని కలెక్టర్ విజయేందిర, ఎస్పీ జానకితో కలిసి స్టేడియంలో రన్‌ఫర్ యూనిటీ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏక్ భారత్ ఆత్మ నిర్భర్ భారత్ సాధనే మనందరి లక్ష్యమని, అప్పుడే పటేల్ ఆశయాలు సాధించినట్లు అవుతుందన్నారు. కలెక్టర్ విజయేందిర మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి ఏక్తా దినోత్సవంగా జరుపుతున్నామన్నారు. పటేల్ కృషి ఫలితంగానే దేశంలో సమైక్యంగా ఉందని, దేశ స్వాతంత్య్రం, సమగ్రత, సమైక్యత కోసం కృషిచేసిన మహనీయుని స్ఫూర్తిగా తీసుకొని దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు. స్టేడియం నుంచి ప్రారంభమైన రన్ ఫర్ యూనిటీ 2కే రన్ అంబేడ్కర్ సర్కిల్, అశోక్ టాకీస్, పాతబస్టాండ్, క్లాక్‌టవర్ వరకు సాగింది. కార్యక్రమంలో డప్పు కళాకారుల ఆట, పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ వెంకటరెడ్డి, యూత్ కోఆర్డినేటర్ కోటా నాయక్, యూనివర్సిటీ విద్యార్థులు, పలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
● సర్ధాల్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా పోలీస్ శాఖ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఆధ్వర్యంలో పరేడ్ మైదానం దగ్గర ఏర్పాటు చేసిన రన్‌ఫర్ యూనిటీ 2కే రన్ కార్యక్రమాన్ని జోగుళాంబ జోన్–7 డీఐజీ ఎల్‌ఎస్ చౌహాన్ జెండా ఊపి ప్రారంభించారు. 2కే రన్‌లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన సీనియర్ పోలీస్ అధికారులు, మహిళా కానిస్టేబుళ్లకు ఎస్పీ డి.జానకి ప్రశంసాపత్రాలు అందించారు. అనంతరం ఎస్పీ కార్యాలయంలో పటేల్ చిత్రపటానికి ఎస్పీ పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఏఎస్పీ రత్నం, డీఎస్పీ వెంకటేశ్వర్లు, రమణారెడ్డి, ఐఎంఏ అధ్యక్షుడు రాంమోహన్ తదితరులు పాల్గొన్నారు.
మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్
మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్


