జడ్చర్ల మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు అడుగులు
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): జీఐఎస్ ఆధారిత మాస్టర్ ప్లాన్ రూపకల్పన సమర్థవంతంగా చేపట్టాలని, ఇందుకోసం అవసరమైన వివరాలను అధికారులు వచ్చేనెల 7లోగా అందించాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని మీటింగ్ హాల్‌లో జడ్చర్ల మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై డీటీసీపీ సంయుక్త సంచాలకులు, అమృత్ 2.0 నోడల్ అధికారి అశ్వినితో కలిసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన సమావేశం నిర్వహించి మాట్లాడారు. పట్టణ ప్రస్తుత స్థితిని అర్థం చేసుకోవడానికి, 20 ఏళ్ల వరకు భవిష్యత్ అవసరాలు అంచనా వేయడానికి ప్రాదేశిక వివరాలను సేకరించాలన్నారు. డిజిటల్ మ్యాపింగ్‌లో డ్రోన్ టెక్నాలజీ ఉపయోగించి భూ వినియోగ మ్యాప్ రూపొందించవచ్చని, నూతన డేటాను జీఐఎస్ ఆధారిత ప్లాన్లను సమీకరించవచ్చని, తద్వారా అభివృద్ధి ప్రతిబింబించేలా అవసరాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవచ్చన్నారు. సమగ్ర ప్రణాళిక ద్వారా భవిష్యత్ అభివృద్ధికి భూ వినియోగం, భవన నిర్మాణం, రవాణా, వివిధ రంగాల అభివృద్ధికి తోడ్పడతాయని చెప్పారు. 2051 సంవత్సరం నాటికి జనాభా మరింత పెరిగే అవకాశం ఉందని, జనాభా ప్రాతిపదికన ప్రజలకు అవసరమైన ఇళ్లు, తాగునీరు, రహదారులు, ఇతర సదుపాయాలు ప్రణాళికాబద్ధంగా కల్పించేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందించాలన్నారు. ప్రతి ఇంటికి తాగునీటి సరఫరా, ఉద్యాన వనాలు, పచ్చదనం అభివృద్ధి చేయడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించడం, వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించడంలో భాగంగా ప్రజా రవాణా వ్యవస్థను ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. జడ్చర్ల పట్టణ పరిధిలో డ్రోన్, సోషియో ఎకనామిక్ సర్వే పూర్తి చేశామని, ముసాయిదా మాస్టర్ ప్లాన్ రూ పొందిస్తామన్నారు. మున్సిపల్ కమిషనర్లు క్షేత్ర స్థాయి సర్వే, గ్రౌండ్ ట్రూతింగ్ కార్యకళాపాల సమయంలో అవసరమైన మద్దతు అందించాలని కోరా రు. సమావేశంలో అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్, ఏఎస్పీ రత్నం, జడ్చర్ల మున్సిపల్ చైర్మన్ పుష్పలత, మున్సిపల్ కమిషనర్ లక్ష్మారెడ్డి, ముఖ్య ప్రణాళిక అధికారి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.


