పోక్సో కేసులో యువకుడి రిమాండ్
గద్వాల క్రైం: పోక్సో కేసులో యువకుడిని రిమాండ్‌కు తరలించినట్లు గద్వాల సీఐ శ్రీను తెలిపారు. గట్టు మండలానికి చెందిన ఓ యువకుడు అదే మండలానికి చెందిన మైనర్ బాలికను ప్రేమ పేరుతో నమ్మించి తీసుకెళ్లాడు. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసు స్టేషన్ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి యువకుడిని అదుపులోకి తీసుకున్నామన్నారు. యువకుడిని విచారించగా నేరం అంగీకరించడంతో బుధవారం గద్వాల కోర్టులో హాజరుపరచి రిమాండ్‌కు తరలించామన్నారు. అయితే మైనార్ బాలికకు కొన్ని రోజుల క్రితం బంధువుల అబ్బాయితో వివాహాం జరిపించారు. ఇష్టం లేని వివాహాం చేయడంతో యువకుడితో వెళ్లినట్లు సమాచారం. ఈ సంఘటనపై విచారణ జరిపి బాధ్యులపై కేసు నమోదు చేస్తామని సీఐ తెలిపారు. అయితే యువకుడిపై గతంలో గట్టు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైనట్లు సీఐ పేర్కొన్నారు.
భార్యతో వీడియోకాల్
మాట్లాడుతూ భర్త ఆత్మహత్య
శాంతినగర్: ఎన్ని మందులు వాడినా ఛాతి నొప్పి తగ్గకపోవడంతో.. భార్యతో వీడియోకాల్ మాట్లాడుతూ భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వడ్డేపల్లి పుర పరిధిలోని పైపాడు శివారులో చోటుచేసుకుంది. ఎస్‌ఐ నాగశేఖర్ రెడ్డి, మృతుని భార్య భారతి ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా.. మానవపాడుకు చెందిన నంద్యాల జితేందర్ నాయుడు (27) గత కొంతకాలంగా ఛాతి నొప్పితో బాధపడుతున్నాడు. వైద్యం కోసం కుటుంబ సభ్యులు కర్నూలులోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లి చూయించారు. ఎన్ని మందులు వాడినా నొప్పి తగ్గలేదు. ఛాతిలో నొప్పి భరించలేక మంగళవారం సాయంత్రం పైపాడు శివారులోని ప్రైవేట్ వెంచర్ వద్దకు పురుగుమందు డబ్బాతో చేరుకున్నాడు. పురుగు మందు తాగుతూ తన భార్య భారతికి వీడియో కాల్ చేసి చనిపోతున్నా.. అంటూ విలపించాడు. ఎక్కడ వున్నావని భార్య అడగ్గా లొకేషన్ పెట్టాడు. దీంతో హుటాహుటీన సంఘటన స్థలానికి చేరుకున్న కుటుంబసభ్యులు.. అతడిని వెంటనే స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చూయించారు. పరిస్థితి విషమంగా వుండటంతో కర్నూలుకు తరలించాలని వైద్యులు సూచించారు. దీంతో కర్నూలులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా కోలుకోలేక మృతిచెందాడు. మృతుడి భార్య భారతి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకుని బుధవారం పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు. మృతుడికి ముగ్గురు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు.


