జిల్లాకేంద్రంలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం
జిల్లా కేంద్రంలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఎర్రకుంట, కొత్తచెరువు నుంచి వచ్చే పాటుకాల్వలు, చిక్కుడువాగు ద్వారా వరద ఉద్ధృతంగా ప్రవహించాయి. ముఖ్యంగా గణేష్‌నగర్ వద్ద రెండు వీధులతో పాటు రాయచూర్ రోడ్డు మొత్తం వరద నీటితో నిండిపోయాయి. అటు గౌడ్స్ కాలనీ వైపు ఉండే కాజ్‌వే మూసుకుపోవడంతో వరద మొత్తం వల్లభ్‌నగర్ డ్రెయినేజీలోకి వెనక్కి మళ్లింది. అలాగే గోల్‌మసీదు మొదలుకుని మోనిన్‌వాడి ఉన్నత పాఠశాల వరకు పెద్ద కాల్వ మొత్తం వరదతో నిండి రోడ్డుపైకి వచ్చింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. న్యూమోతీనగర్‌లోని ఆర్‌యూబీ వద్ద, కొత్త బస్టాండు ప్రాంగణం, మోటార్‌లైన్, ఎంబీసీ కాంపౌండ్, గచ్చిబౌలి, రామయ్యబౌలి, బీకేరెడ్డికాలనీ, నాగిరెడ్డికాలనీ, నాగేంద్రకాలనీ, వెంకటరమణ కాలనీ, భూత్పూర్ రోడ్డులోని శ్రీశివసాయిరాం కాలనీలలో వరద నీరు చేరింది.


