వాగులు, చెరువుల వద్దకు వెళ్లొద్దు: ఎస్పీ
మహబూబ్‌నగర్ క్రైం: భారీ వర్షాల నేపథ్యంలో పలు చెరువులు, వాగులు పొంగిపొర్లుతున్న క్రమంలో రైతులు, వ్యవసాయ కూలీలు, పశువు ల కాపరులు జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ డి.జానకి సూచించారు. జిల్లాకేంద్రంలోని పెద్ద చెరువు పరిసర ప్రాంతాలు, రామయ్యబౌలి ట్యాంక్‌బండ్, ఎర్రకుంట చెరువు, ఆలీ మార్ట్ ఎదురుగా ఉన్న జాతీయ రహదారిని బుధవారం పరిశీలించారు. నీటి మట్టం, ప్రవాహ పరిస్థితులను పరిశీలించి సదరు అధికారులకు ఆదేశాలిచ్చారు. ప్రాణ, ఆస్తి రక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు వెంటనే ఏర్పాటు చేయాలని సూచించారు. నీటి ప్రవాహాలు దగ్గరికి ఎవరూ వెళ్లరాదని, రోడ్లపై భారీ వరద ఉన్న సమయంలో వాహనదారులు రోడ్డు దాటాలనే ప్రయత్నాలు చేయరాదన్నారు. వృద్ధులు, చిన్న పిల్లలు వాగులు, చెరువుల వైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పోలీసులు డిజాస్టర్ మేనేజ్‌మెంట్ బృందాలతో సమన్వయం కలిగి ఉండాలన్నారు.


