‘మోంథా’తో ఆగమాగం
● పొంగిన వాగులు, వంకలు
● రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయం
● స్తంభించిన రాకపోకలు
● నీట మునిగిన పంట పొలాలు
మహబూబ్‌నగర్ (వ్యవసాయం)/మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ‘మోంథా’ తుపాను వల్ల జిల్లా అతలాకుతలమైంది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంల్లోకి వరద నీరు భారీగా చేరుకోవడంతో పొంగిపొర్లుతున్నాయి. జిల్లాలో సగటున 5 సెంమీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా జడ్చర్ల మండలంలో 9.06 సెంటీమీటర్ల వర్షం కురిసింది. గ్రామీణ రహదారులు ధ్వంసమయ్యాయి. ఏకధాటిగా వర్షం కురుస్తుండటంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ముందు జాగ్రత్తగా జిల్లా అధికారులు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు.
● మూసాపేట, అడ్డాకుల మండలాల్లో పెద్దవాగులో నిర్మించిన చెక్‌డ్యాంలు వరద నీటితో నిండుగా ప్రవహించాయి. కాజ్‌వేపై నుంచి వాగు ఉధృతంగా ప్రవహించడంతో కొమిరెడ్డిపల్లి, గౌరిదేవిపల్లి గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పటికే పంట కోతలు పూర్తి చేసి ధాన్యాన్ని నిల్వ చేయగా వర్షానికి పూర్తిగా తడిసిపోవడంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. కన్మనూర్‌లో ఓ మట్టి ఇల్లు మిద్దె కూలిపోయింది.
● మహమ్మదాబాద్ మండలంలో వేరుశనగ పంట దెబ్బతింది. చెరువులు అలుగు పారడం వల్ల పొలాలు నీటి మునిగాయి. కోతకోసిన వరి నూర్పిళ్లు కల్లాలోనే ఉండడంతో మెలకెత్తుతున్నాయి.
● జడ్చర్ల మున్సిపాలిటీలోని ప్రధానరహదారులను వరద ప్రవాహం ముంచెత్తింది. దుందుభీ వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. గంగాపూర్–కోడ్గల్ ప్రధాన రహదారిపై, కిష్టారం చెరువు అలుగు పారడంతో రాకపోకలు స్తంభించాయి. నవాబుపేట, బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌లో ఆరబోసిన మొక్కజొన్న కొట్టుకుపోయింది. మార్కెట్‌లో కుప్పలుగా పోసిన మక్కలు మొలకెత్తాయి.
● మిడ్జిల్ మండలంలో వర్షం బీభత్సం సృష్టించింది. మల్లాపూర్ దగ్గర కేఎల్‌ఐ కాల్వకు గండి పడడంతో దాదాపు వంద ఎకరాలలో వరి పంట దెబ్బతింది. బోయిన్‌పల్లి–రాంరెడ్డి పల్లి గ్రామాల మధ్యలో రోడ్డు తెగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. మండలకేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలోకి భారీగా వరద చేరింది. ఎన్‌హెచ్ 167పై వరద ప్రవాహంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
625 ఎకరాల్లో వరి పంట నష్టం
జిల్లాలో 625 ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.జడ్చర్ల మండలంలో 135 ఎకరాలు, బాలానగర్‌లో 100 ఎకరాలు, అడ్డాకులలో 110, నవాబుపేటలో 62, రాజాపూర్‌లో 50, మూసాపేటలో 45, మిడ్జిల్‌లో 60, దేవరకద్రలో 64, భూత్పూర్‌లో 25, హన్వాడలో 4 ఎకరాల మేర వరిపంట నేలకొరిగింది.
నష్టాన్ని తక్కువ చూపుతున్న వ్యవసాయశాఖ
ఆగస్టు నుంచి అధిక వర్షాలు కురుస్తున్నా వ్యవసాయశాఖ నష్టాన్ని నామమాత్రంగా చూపుతుంది. ఆగస్టు నెలలో ఏకంగా 132 శాతం అధిక వర్షపాతం నమోదై పంటలు దెబ్బతిన్నా ఎలాంటి పంట నష్టాన్ని చూపకపోవడం విమర్శలకు తావిస్తోంది. సెప్టెంబర్‌లో 50 శాతం అఽధిక వర్షపాతం నమోదైంది. పంటలు చూడటానికి పచ్చగా ఉన్నా దిగుబడులు మాత్రం లేవు.
‘మోంథా’తో ఆగమాగం
‘మోంథా’తో ఆగమాగం
‘మోంథా’తో ఆగమాగం


