మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపుతాం
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: చేపల పెంపకం ద్వారా మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపుతామని రాష్ట్ర మత్య్స, పాడి పశుసంవర్ధక, యువజన సర్వీసులు క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. బుధవారం కోయిల్‌సాగర్ ప్రాజెక్టులో మొదటి విడతగా 2.50 లక్షల చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వంద శాతం సబ్సిడీ కింద మంత్రి వాకిటి శ్రీహరితో పాటు ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ విజయేందిర, అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, మత్స్యశాఖ ఖదీర్ అహమ్మద్, ఏడీ రాధారోహిణితో కలిసి వదిలారు. రాష్ట్రంలో మత్స్య సంపద అభివృద్ధికి రూ.123 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. చేపల పెంపకంపై ఆధారపడిన 5 లక్షల మంది ఆర్థిక అభివృద్ధికి జీవనోపాధి కలుగనున్నట్లు చెప్పారు. దేవరకద్ర నియోజకవర్గానికి మక్తల్‌తో పాటు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. గత పాలకులు పదేళ్ల పాటు చేపపిల్లల ఉత్పత్తిపై దృష్టి సారించలేదని ఆరోపించారు. తాను ముదిరాజ్ కావడం.. అలాగే మంత్రి కావడంతో మత్స్యశాఖకు అధిక నిధులు కేటాయించేలా చేసినట్లు పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఇచ్చిన హామీలకు కట్టుబడి పని చేస్తున్నామన్నారు. ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో మత్స్యకారులకు అన్ని విధాలా అండగా ఉన్నామని పేర్కొన్నారు. కచ్చితమైన 80ఎంఎం సైజుతో చేపపిల్లలను వదులుతున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ విజయేందిర, అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్, మత్స్యశాఖ డీడీ ఖదీర్ అహ్మద్, ఏడీ రాధారోహిణి, ఆర్డీఓ నవీన్, మార్కెట్ చైర్మన్ కతలప్ప, ఎంపీడీఓ శ్రీనివాసరావు, తహసీల్దార్ దీపిక, మున్సిపల్ చైర్మన్ నరేష్‌బాబు, తదితరులు పాల్గొన్నారు.


