టీటీడీ ఆధ్వర్యంలో భగవద్గీత కంఠస్థ పోటీలు
స్టేషన్ మహబూబ్‌నగర్: తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలోని ఐదు కేంద్రాల్లో భగవద్గీత కంఠస్థ, భావ విశ్లేషణ పోటీలు నిర్వహిస్తున్నట్లు టీటీడీ జిల్లా కార్యక్రమ నిర్వాహకులు డాక్టర్ ఉత్తరపల్లి రామాచారి తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని టీటీడీ కల్యాణ మండపంలో జరిగిన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ మూడు విభాగాల్లో భగవద్గీత కంఠస్థ పోటీలు ఉంటాయని తెలిపారు. మొదటి గ్రూప్ 6 నుంచి 9 తరగతుల విద్యార్థులకు 14వ అధ్యాయం గణత్రయ విభాగ యోగం, రెండో గ్రూప్ పదోతరగతి నుంచి ఇంటర్ వరకు 16వ అధ్యాయం దైవాసుర సంపద్విభాగ యోగం, మూడో గ్రూప్ 18 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వారికి నిత్య జీవితంలో భగవద్గీత భావ విశ్లేషణపై పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. 8, 9 తరగతులకు, 18 ఏళ్లలోపు 18 ఏళ్లుపైబడిన వారికి సంపూర్ణ భగవద్గీత 700 శ్లోకాలపై పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. నవంబర్ 11న నారాయణపేటలోని గీతా భారతి స్కూల్, 18న గద్వాలలోని శ్రీసరస్వతి టాలెంట్ స్కూల్, 23న వనపర్తి జిల్లా తాటిపాములలోని శ్రీరీతాంబర విద్యాలయం, 25న మహబూబ్‌నగర్‌లోని టీటీడీ కల్యాణ మండపంలో, 27న నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలోని శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయంలో కంఠస్థ, భావ విశ్లేషణ పోటీలు ఉంటాయని తెలిపారు. ఈ విభాగాల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వారికి బహుమతులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో రాములు, సురేష్ చందర్ దూత్, కేశవులు తదితరులు పాల్గొన్నారు.


