బాధితులకు సత్వర న్యాయం చేయాలి
నాగర్‌కర్నూల్ క్రైం: పోలీసుస్టేషన్లకు వచ్చే ఫిర్యాదిదారుల సమస్యలు తెలుసుకుని సత్వర న్యాయం జరిగేలా చూడాలని జోగుళాంబ జోన్–7 డీఐజీ ఎల్‌ఎస్ చౌహాన్ అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని ఎస్పీ కార్యాలయంతోపాటు పోలీస్‌స్టేషన్‌ను డీఐజీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయానికి వచ్చిన డీఐజీకి ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ పూలబొకే అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ఎస్పీ కార్యాలయంతోపాటు పోలీస్‌స్టేషన్‌లో రికార్డులు పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ పోలీసుస్టేషన్లలో కేసులను పెండింగ్‌లో పెట్టకుండా త్వరగా విచారణ పూర్తి చేసి బాధితులకు న్యాయం జరిగేలా చూడటంతోపాటు నిందితులకు శిక్ష త్వరగా పడేలా చూడాలన్నారు. దొంగతనాలు జరగకుండా ఉండటం కోసం ప్రతిరోజు పెట్రోలింగ్ నిర్వహించాలన్నారు. సైబర్ నేరాలపై పోలీసుశాఖ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. మహిళలు, విద్యార్థుల రక్షణ కోసం ప్రతిరోజు రద్దీ ప్రాంతాల్లో మఫ్టీలో నిఘా ఏర్పాటు చేసి ప్రజల్లో పోలీసుల పట్ల నమ్మకం పెరిగేలా చూడాలన్నారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఏఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎస్పీ శ్రీనివాస్, సీఐ అశోక్‌రెడ్డి, ఎస్‌ఐ గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.


