ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మంగళవారం నగరంలోని టీడీగుట్ట నుంచి బోయపల్లి రైల్వేగేటు వరకు ట్రాక్ పక్కన ఉన్న నివాస ప్రాంతాలను పరిశీలించారు. కాగా, కొన్ని నెలలుగా ఈ ప్రాంతాల్లో రైల్వే శాఖ ఆధ్వర్యంలో డబుల్‌లైన్ పనులు కొనసాగుతున్నాయని, ఇందులో భాగంగా నిర్మిస్తున్న కాంపౌండ్ వాల్‌తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పరిసర ప్రాంత ప్రజలు ఫిర్యాదు చేశారు. దీని పక్క నుంచి సీసీరోడ్డుతో పాటు యూజీడీ యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అలాగే బాధిత కుటుంబాలకు రైల్వేశాఖ ద్వారా తక్షణ సాయం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. అంతకుముందు ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్ ప్రాంగణంలో రూ.పది కోట్లతో నిర్మించనున్న పూలే–అంబేద్కర్ విజ్ఞాన కేంద్రానికి శంకుస్థాపన చేశారు. దీనిని అందరికీ ఉపయోగపడేలా తీర్చిదిద్దుతామన్నారు. ఇందులో ప్రత్యేక డిజిటల్ లైబ్రరీ, విశాలమైన హాల్స్, వివిధ పుస్తకాలు అందుబాటులో ఉంచుతామన్నారు. అలాగే నగర టాక్సీ క్యాబ్ డ్రైవర్లు, యజమానుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గార్మీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు మల్లు నర్సింహారెడ్డి, వ్యవసాయ చైర్‌పర్సన్ బెక్కరి అనిత, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్‌కుమార్‌గౌడ్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు వసంత, నాయకులు సిరాజ్‌ఖాద్రీ, షబ్బీర్ అహ్మద్, సాయిబాబా, సీజే బెన్‌హర్, అమరేందర్‌రాజు, తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం


