
తండ్రి మందలించాడని కుమారుడి ఆత్మహత్య
మల్దకల్: వ్యవసాయ పనులకు వెళ్లకుండా జులాయిగా తిరుగుతున్న కుమారుడిని తండ్రి మందలించడంతో మనస్థాపం చెందిన కుమారుడు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని నాగర్‌దొడ్డిలో గురువారం చోటు చేసుకుంది. పూర్తి వివరాలిలా.. నాగర్‌దొడ్డి గ్రామానికి చెందిన తిమ్మప్ప, పద్మమ్మ దంపతులకు కుమారుడు రాఘవేంద్ర(19), కుమార్తె ఉన్నారు. దంపతులు ఇద్దరూ ఉన్న కొద్ది పాటి వ్యవసాయ పొలంలో పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఈక్రమంలో వ్యవసాయ పనులకు వెళ్లాలని తండ్రి కుమారుడిని మందలించడంతో మనస్థాపం చెందిన రాఘవేంద్ర పురుగు మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబీకులు చికిత్స నిమిత్తం గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి రెఫర్ చేశారు. చికిత్సపొందుతూ రాఘవేంద్ర మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మృతదేహం
వెలికితీసి పోస్టుమార్టం
భూత్పూర్: మండలంలోని కప్పెటకు చెందిన పొనకండి సంతోష్ (25) గ్రామానికి చెందిన మరో ఇద్దరితో కలిసి ట్రాక్టర్‌లో ఇసుక నింపడానికి 2025, జూలై 29న ఉదయం గ్రామ సమీపంలోని వాగుకు వెళ్లి మృతిచెందాడు. శరీరంపై గాయాలు ఉండగా.. గ్రామపెద్దలు నచ్చజెప్పడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయకుండానే పూడ్చిపెట్టారు. సంతోష్ సోదరుడు శ్రీను ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేరగా గురువారం తహసీల్దార్ కిషన్, పోలీసుల సమక్షంలో వైద్యులు అంత్యక్రియలు నిర్వహించిన ప్రాంతంలో మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. సంతోష్ భార్య ఐదేళ్ల కిందటే విడిపోవడంతో కుమారుడు గణేష్ అనాథ ఆశ్రమంలో ఉంటూ 6వ తరగతి చదువుకుంటున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ట్రాక్టర్ యజమానే తన సోదరుడి మృతికి కారణమని శ్రీను ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని కోరారు.

తండ్రి మందలించాడని కుమారుడి ఆత్మహత్య

తండ్రి మందలించాడని కుమారుడి ఆత్మహత్య