
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
● అన్నంలో మెరికలు ఉండడం ఏమిటి
● వంట నిర్వాహకులపై కలెక్టర్ విజయేందిర ఆగ్రహం
జడ్చర్ల: విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన మంచి భోజనం అందించాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. గురువారం మండలంలోని కోడ్గల్ గ్రామంలో గల తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల బాలికల జూనియర్ కళాశాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా విద్యార్థులకు వండిన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించగా.. అన్నంలో మెరికలు కనిపించడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. బియ్యాన్ని శుభ్రంగా కడిగి భోజనం వండాలని, మెరికలు లేకుండా చూడాలని, భోజన నాణ్యతను ఫుడ్ సేఫ్టీ కమిటీ పర్యవేక్షించాలని ఆదేశించారు. నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వంట పాత్రలు శుభ్రంగా వినియోగించాలని, ఆకుకూరలు, కూరగాయల ఎంపిక నాణ్యతగా ఉండాలని సూచించారు.
నిబంధనల మేరకు వ్యవహరించాలి
నిబంధనల ప్రకారంగా స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు. జడ్చర్ల మండల పరిషత్ కార్యాలయంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని, కోడ్గల్ క్లస్టర్‌లో ఎంపీటీసీ నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని, హెల్ప్ డెస్క్‌ను పరిశీలించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ విజయ్‌కుమార్, తహసీల్దార్ నర్సింగరావు, ఎంఈఓ మంజులాదేవి తదితరులు పాల్గొన్నారు.