
ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. గురువారం ఆయన ఫాంహౌజ్‌లో హన్వాడ మండల ముఖ్య నాయకులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. గ్రామాల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నందున ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలుపొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు బాకీ కార్డులు ఇచ్చి చేసిన మోసాన్ని వివరించాలన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్ల కాలంలో గ్రామం, మండలంలో చేసిన అభివృద్ధి, ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెబుతారని జోస్యం చెప్పారు. సమావేశంలో మాజీ ఎంపీపీ బాలరాజు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు నరేందర్, బీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు కరుణాకర్‌గౌడ్, నాయకులు చెన్నయ్య, లక్ష్మయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.