
నూతన విద్యా విధానాన్ని విరమించుకోవాలి
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని అమలు చేయాలనే ఆలోచనలను విరమించుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామెర కిరణ్ డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎస్‌ఎఫ్‌ఐ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం సెకండరీ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో ఇంటర్మీడియట్ బోర్డును విలీనంచేసే మార్గదర్శకాల రూపకల్పనకు కసరత్తు చేస్తోందన్నారు. సంస్కరణల పేరుతో 42,000 ప్రభుత్వ పాఠశాలలను 6వేలకు కుదించే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం నూతన విద్యావిధానం అమలు చేయాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని.. ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలన్నారు. సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు ప్రశాంత్, కార్యదర్శి భరత్, శ్రీనాథ్, రమేశ్, రాజేశ్ ఉన్నారు.
వాహనాల
అద్దె చెల్లించండి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ప్రభుత్వ కార్యాలయాలకు అద్దెకు ఇచ్చిన వాహనాల బిల్లులను వెంటనే చెల్లించాలని తెలంగాణ ఫోర్ వీలర్స్, డ్రైవర్స్ హైర్ వెహికిల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ ఖాదర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం డీఎంహెచ్‌ఓ కృష్ణకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా వైద్యారోగ్యశాఖలో ఏడు వాహనాలు నడుస్తున్నాయని.. వాటికి సంవత్సరం నుంచి బిల్లులు చెల్లించకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. తమకు బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ శాఖలోనే కాకుండా వివిధ శాఖల్లో నడుస్తున్న వాహనాలకు బిల్లులు రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయని.. వాహనాల బిల్లులు రాకుంటే ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తంచేశారు. కార్యక్రమంలో యూనియన్ ఉపాధ్యక్షుడు రమేశ్‌నాయక్, షకీల్, శేఖర్, శ్రీశైలం, తిరుపతి, సూర్య పాల్గొన్నారు.
నేడు ఆలయాల మూసివేత
చిన్నచింతకుంట/మహబూబ్‌నగర్ రూరల్: సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం నుంచి జిల్లాలోని ప్రధాన పుణ్యక్షేత్ర ఆలయాలను మూసివేయనున్నారు. అమ్మాపురంలోని శ్రీకురుమూర్తిస్వామి, మన్యంకొండ ఆలయాలను ఆదివారం మధ్యాహ్నం నుంచి మూసివేయనున్నారు. ఆలయ శుద్ధి తర్వాత భక్తులకు సోమవారం ఉదయం 9 గంటల నుంచి మన్యంకొండ, సాయంత్రం 5 గంటల నుంచి కురుమూర్తిస్వామి వారి దర్శనం కల్పిస్తారు.

నూతన విద్యా విధానాన్ని విరమించుకోవాలి