
యూరియా కోసం రోడ్డెక్కారు
గండేడ్: యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. గండేడ్ మండల కేంద్రంలో రాస్తారోకోకు దిగగా.. పోలీసులు జోక్యం చేసుకొని అధికారులతో మాట్లాడి నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. మండలంలోని ఆయా గ్రామాల రైతులు శనివారం యూరియా కోసం మండల కేంద్రానికి చేరుకున్నారు. తమకు యూరియా కావాలని పలు దుకాణాల్లో ఆరాతీశారు. యూరియా రాలేదని.. వచ్చినప్పుడు ఇస్తామని ఎరువుల దుకాణాల యజమానులు సమాధానమిచ్చారు. గంటల తరబడి వేచిచూసిన రైతులు సహనం నశించి ఆందోళనకు దిగారు. భూత్పూర్–చించోళి జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని రైతులను సముదాయించే ప్రయత్నం చేయగా.. తాము రోజుల తరబడి తిరగుతున్నా.. బస్తా యూరియా కూడా దొరకడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా వచ్చే వరకు పక్కకు తప్పుకొనే ప్రసక్తేలేదని మొండికేశారు. పీఏసీఎస్ చైర్మన్ లక్ష్మీనారాయణ అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడినా.. ససేమిరా అన్నారు. తాము ఎన్నిరోజులు తిరగాలని ప్రశ్నించారు. ఎప్పుడు వచ్చినా యూరియా రాలేదని చెబుతున్నారు. యూరియా వచ్చినప్పుడు కనీస సమాచారం కూడా ఇవ్వడం లేదని.. తెలుసుకుని వచ్చేలోపే యూరియా అయిపోతుందని చెబుతున్నారని వాపోయారు. దాదాపు అరగంటకుపైగా కావడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. రైతులు ఆందోళన విరమించకపోవడంతో మహమ్మదాబాద్ ఎస్‌ఐ శేఖర్‌రెడ్డి అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడారు. అనంతరం యూరియా సరఫరా లేక రైతుల ఇక్కట్లపై అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఆది, సోమవారాల్లో యూరియా వచ్చే అవకాశం ఉందని, రాగానే ప్రతిరైతుకు రెండు బస్తాల చొప్పున ఇస్తామని వ్యవసాయ అధికారులు చెప్పారని ఎస్‌ఐ చెప్పడంతో ఆందోళన విరమించారు. అనంతరం పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు.
చించోళి జాతీయ రహదారిపై
రైతుల రాస్తారోకో
అర గంట పాటు నిలిచిన
వాహనాల రాకపోకలు
పోలీసుల జోక్యంతో ఆందోళన విరమణ