
అట్టహాసంగా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్
● 11వ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ పోటీలు
● టోర్నీని ప్రారంభించిన ఎమ్మెల్యే
● ఉత్కంఠంగా మెయిన్ డ్రా మ్యాచ్‌లు
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లా కేంద్రంలోని మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో 11వ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బాల, బాలికల (అండర్–13) బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో మెయిన్ డ్రా మ్యాచ్‌లు ఉత్కంఠ భరితంగా జరిగాయి.
తొలిరోజు ఫలితాలు
బాలుర సింగిల్స్‌లో పబ్బు శివంశ్ (మేడ్చల్) 15–8, 15–8 సెట్ల తేడాతో ఈకాంశ్ (వరంగల్)పై, రిషిశ్రీరాం (మేడ్చల్) 15–6, 15–3 తేడాతో ఆరుష్ నడింపల్లిపై, అద్వైత్ సత్తు (వికారాబాద్) 15–6, 15–7 తేడాతో అభినిత్ అసోల్లపై, కార్తీకేయ (రంగారెడ్డి) 15–9, 15–8 తేడాతో జార్జి నిశ్చయ్‌పై, బాలికల సింగిల్స్‌లో అభజాదవ్ (రంగారెడ్డి) 15–8, 15–9 తేడాతో వేదితరెడ్డి (వరంగల్)పై, దియా ఆనంద్(వికారాబాద్) 10–15, 15–6, 15–12 తేడాతో జోవిత దేబ్‌నాత్‌పై, అన్విరెడ్డి (సూర్యాపేట)15–1, 15–1 తేడాతో ప్రకృతి (భద్రాద్రి)పై గెలుపొందింది. పలువురు క్రీడాకారులు సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు.
ఎమ్మెల్యే అసహనం
రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో ఫ్లెక్సీలో ఫొటోల ప్రొటోకాల్ విషయంలో నిర్వాహకులపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. టోర్నీ వేదికపై ఉన్న ఫ్లెక్సీలో రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి ఫోటో ఎందుకు పెట్టలేదని, అదే విధంగా ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడి ఫోటోలు పెట్టకపోవడంపై అసహసనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వసతుల్లో టోర్నమెంట్‌లు నిర్వహిస్తే ఖచ్చితంగా ప్రొటోకాల్ పాటించాలని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యత
రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌ను ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. బ్యాడ్మింటన్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 7 వ తేదీ వరకు నిర్వహించనున్న చాంపియన్‌షిప్‌లో రాష్ట్ర వ్యాప్తంగా 200 మంది క్రీడాకారులు పాల్గొనున్నట్లు తెలిపారు. జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ క్రీడాకారులకు అన్ని రకాల వసతులు కల్పించి టోర్నీని విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. క్రీడాకారులకు ప్రత్యేక కోచింగ్ ఇచ్చి వారి నైపుణ్యాన్ని వెలికితీయడానికి నూతన క్రీడా పాలసీ తీసుకొచ్చినట్లు తెలిపారు. మహబూబ్‌నగర్ స్టేడియంలో క్రీడాభివృద్ధి కోసం ఇటీవల రూ.16.50 కోట్లు కేటాయించామన్నారు. త్వరలో క్రీడాశాఖ మంత్రితో క్రీడాభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. ఇండోర్ స్టేడియంలో ఏసీ, స్పోర్ట్స్ హాస్టల్ నిర్మాణంతోపాటు మూడు, నాలుగు క్రీడలను ఎంపిక చేసుకొని క్రీడాకారులకు శిక్షణ ఇచ్చి జాతీయస్థాయిలో చాంపియన్లుగా తీర్చిదిద్దడానికి కృషి చేయనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులకు ఎమ్మెల్యే సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వెంకటేశ్, కురుమూర్తిగౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్‌కుమార్‌గౌడ్, డీసీసీ కార్యదర్శి సిరాజ్‌ఖాద్రీ, టోర్నీ పరిశీలకుడు సుధాకర్, రెఫరీ కిషోర్, జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు శ్యాంసుందర్‌గౌడ్, రవికుమార్, జిల్లా సంయుక్త కార్యదర్శులు నాగరాజుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

అట్టహాసంగా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్