
యూరియా చల్లేందుకు వెళ్లి వ్యక్తి మృతి
గోపాల్‌పేట: యూరియా చల్లేందుకు కూలీకి వెళ్లిన ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన వనపర్తి జిల్లా రేవల్లి మండలంలోని నాగపూర్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. రేవల్లి ఎస్‌ఐ రజిత కథనం ప్రకారం.. నాగపూర్ గ్రామానికి చెందిన ఎండీ మైను(49) కుటుంబ పోషణ కోసం కూలీ పనులకు వెళ్తుంటాడు. ఈ క్రమంలో శుక్రవారం అదే గ్రామానికి చెందిన మధుకర్‌రెడ్డి పొలంలో యూరియా చల్లేందుకు మైను మద్యం తాగి కూలీకి వెళ్లాడు. యూరియా చల్లుతుండగా బోర్లా పడ్డాడు. కొద్దిసేపు ఎవరూ గమనించకపోవడంతో ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై మైను భార్య నూర్జహాన్‌బేగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.