
తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ
వనపర్తి రూరల్: తాళం వేసిన ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడిన ఘటన శ్రీరంగాపురం మండలం శేరుపల్లిలో శుక్రవారం జరిగింది. శ్రీరంగాపురం ఎస్‌ఐ రామకృష్ణ తెలిపిన వివరాలు.. శేరుపల్లికి చెందిన వెంకటయ్య ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలసి పొలం దగ్గరకు వెళ్లాడు. తిరిగి సాయంత్రం 4 గంటలకు ఇంటికి వచ్చి చూడగా బీరువా తెరచి ఉంచడాన్ని గమనించారు. రూ.80 వేల నగదు 2.7 తులాల బంగారం చోరీ జరిగినట్లు ఫిర్యాదు చేసినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.
వివాహిత ఆత్మహత్య
బల్మూర్: మండలంలోని బాణాల గ్రామానికి చెందిన సంపంగి పార్వతమ్మ(28) ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ రాజేందర్ తెలిపిన వివరాలు.. ఎనిమిదేళ్ల కిందట నల్లగొండ జిల్లా నేరోడిగోమ్‌కు చెందిన నరేష్‌తో పార్వతమ్మకు వివాహమైంది. భార్య ప్రవర్తనపై భర్త మందలించాడు. దీంతో మనస్తాపానికి గురై ఆమె గురువారం రాత్రి పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు నాగర్‌కర్నూల్ ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తునట్లు ఎస్‌ఐ తెలిపారు.