
తండ్రిని చితకబాది కారు డిక్కీలో తీసుకెళ్లిన కుమారుడు
● డిండిచింతలపల్లి వద్ద వాగులో పడేసినట్లు గుర్తింపు
● డిండి ప్రాజెక్టు బ్యాక్ వాటర్ పొలాల వద్ద దొరికిన మృతదేహం
కల్వకుర్తి టౌన్: కొడుకు చేతిలో దారుణ హత్యకు గురైన బాలయ్య(70) మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా.. నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని వాసవీనగర్‌కు చెందిన బాలయ్యను బుధవారం సాయంత్రం ఆయన కుమారుడు తండ్రిని తీవ్రంగా కొట్టి కారు డిక్కీలో వేసుకుని వెళ్లిన విషయం తెలిసిందే. సీసీ కెమెరాలను పరిశీలించగా కుమారుడు బీరయ్యనే దాడి చేసి కారులో తీసుకెళ్లినట్లు గుర్తించి గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో బాలయ్య మృతదేహాన్ని మండలంలోని డిండిచింతపల్లి వద్ద బ్రిడ్జిపై నుంచి అక్కడ ఉన్న వాగులో పడేసినట్లు గుర్తించి.. శుక్రవారం ఉదయం నుంచి కల్వకుర్తి సీఐ నాగార్జున ఆధ్వర్యంలో ఎస్‌ఐలు మాధవరెడ్డి, వెంకట్‌రెడ్డి, నరేష్ ఆధ్వర్యంలో డ్రోన్, గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చేపట్టారు. చివరకు ఉప్పునుంతల మండలం కొరటికల్ వద్ద డిండి ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వెంట పొలాల వద్ద ఉండే వారు మృతదేహం ఒడ్డుకు వచ్చిందని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి వెళ్లి పరిశీలించగా.. బాలయ్య మృతదేహంగా గుర్తించారు. ఈ మేరకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎక్కడకు తరలించాలన్న విషయాన్ని గురించి పోలీస్ ఉన్నతాధికారుల సూచనల మేరకు తరలిస్తామని పోలీసులు తెలిపారు. తండ్రిని హత్య చేసిన బీరయ్య ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడని, అతనికి సహకరించిన బీరయ్య బావమరిది సైతం అదుపులో ఉన్నాడని సమాచారం. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తండ్రిని చితకబాది కారు డిక్కీలో తీసుకెళ్లిన కుమారుడు