రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
చారకొండ: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ శంషొద్దీన్ కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం ఎల్లారెడ్డి బావిగేటుకు చెందిన మామిళ్ల ముత్తయ్య యాదవ్(40) స్వగ్రామం నుంచి చారకొండకు ద్విచక్రవాహనంపై వస్తున్నాడు. ఈ క్రమంలో వాయిల్‌కోల్ గ్రామానికి చెందిన చిన్నయ్య ద్విచక్రవాహనంలో పెట్రోల్ అయిపోవడంతో రోడ్డు పక్క నుంచి నెట్టుకొంటూ వెళ్తున్నాడు. మర్రిపల్లి సమీపంలో ముందుగా వెళ్తున్న చిన్నయ్య బైక్‌ను ముత్తయ్య ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో ముత్తయ్య తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ముత్తయ్య భార్య లక్ష్మమ్మతోపాటు ముగ్గురు ఆడపిల్లలు, కొడుకు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


