వడ్డీ.. జబర్దస్తీ! | - | Sakshi
Sakshi News home page

వడ్డీ.. జబర్దస్తీ!

Nov 27 2026 12:56 AM | Updated on Nov 27 2026 12:56 AM

వడ్డీ.. జబర్దస్తీ!

సాక్షిప్రతినిధి, వరంగల్‌ : ప్రకృతి ప్రకోపంతో పంటలు దెబ్బతిని అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులకు ప్రభుత్వం ప్రకటించిన రుణ ఉపశమనం ఇంకా పూర్తిస్థాయిలో అందకముందే బ్యాంకులనుంచి వసూళ్ల ఒత్తిళ్లు మొదలయ్యాయి. కరువు మండలాల్లో పంట రుణాల రీషెడ్యూలింగ్‌, ఏడాది మారటోరియం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ.. ఆ గడువు వచ్చేలోపే పాత రుణాల రెన్యువల్స్‌ పేరుతో రైతులను బ్యాంకులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఫోన్ల మీద ఫోన్లు చేసి వడ్డీలు చెల్లించాలని, రుణాలను రెన్యువల్‌ చేసుకోవాలని ఒత్తిడి తెస్తున్నట్లు రైతులు వాపోతున్నారు.

డిసెంబర్‌ 8 నుంచి ఉపశమనం!

2026 ఖరీఫ్‌ సీజన్‌లో వర్షాభావ పరిస్థితులతో పంటలు నష్టపోయిన రైతులకు ఊరటనిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం రుణాల పునర్వ్యవస్థీకరణ చర్యలు చేపట్టింది. ఈ నెల 10న జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) ప్రత్యేక సమావేశంలో 2026–27 వార్షిక రుణ ప్రణాళిక ప్రకారం ఉమ్మడి వరంగల్‌లోని ఆరు జిల్లాలకు కలిపి 2,88,066 పంట రుణ ఖాతాల ద్వారా రూ.7,948.11 కోట్ల రుణాల లక్ష్యాన్ని నిర్దేశించారు. దీంతోపాటు కరువు ప్రభావిత ప్రాంతాల్లో అర్హులైన రైతుల పంట రుణాలను ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం రీషెడ్యూల్‌ చేయాలని, కొత్త రబీ రుణాలు కూడా అందించాలని బ్యాంకులకు సూచించింది. రుణాలపై వడ్డీ భారాన్ని తగ్గించే అవకాశాలను పరిశీలించాలని కోరింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ప్రకారం డిసెంబర్‌ 8 నుంచి మారటోరియం అమలు కావాల్సి ఉందని రైతులు ఆశిస్తున్నారు. ఏడాది పాటు రుణ చెల్లింపుల నుంచి ఉపశమనం కల్పించడం, పాత పంట రుణాలను దీర్ఘకాలిక రుణాలుగా మార్చడం వంటి చర్యలతో తమకు ఊరట లభిస్తుందని భావిస్తున్నారు.

వడ్డీ కట్టాల్సిందేనంటూ ఫోన్లు!

సాధారణంగా పంట రుణాల రెన్యువల్‌ సమయంలో రైతులు వడ్డీ చెల్లించి ఖాతాలను తిరిగి కొనసాగిస్తుంటారు. కానీ ఈసారి కరువు కారణంగా పంట దిగుబడులు తగ్గి, పెట్టుబడులు కూడా చేతికి రాని పరిస్థితి నెలకొంది. ఇలాంటి సమయంలో వడ్డీ చెల్లించి రెన్యువల్‌ చేసుకోవాలని బ్యాంకుల నుంచి సమాచారం వస్తుండటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మారటోరియం అమలుకు మరికొద్ది రోజులే ఉండటంతో.. అప్పటివరకు ఆగకుండా ఇప్పుడే వడ్డీ చెల్లించాలని, రుణ ఖాతాలను రెన్యువల్‌ చేసుకోవాలని ఫోన్లు చేస్తున్నట్లు పలువురు రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం ఒకవైపు రుణభారం తగ్గించాలని చూస్తుంటే.. క్షేత్రస్థాయిలో బ్యాంకుల తీరు మరోలా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రుణాల రికవరీకి

ఇబ్బంది పెట్టడం లేదు..

ప్రభుత్వం రుణాలపై మారటోరియం విధించిన నేపథ్యంలో రైతులను రికవరీ కోసం ఇబ్బంది పెట్టడం లేదు. పాత వాటిని రీషెడ్యూల్‌ చేయడంతోపాటు, అర్హులైన రైతులకు కొత్త రుణాలు కూడా అందిస్తాం. రికవరీ కోసం ఒత్తిడి చేయవద్దని అన్ని బ్యాంకులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం. బ్యాంకులు ఒత్తిడి చేస్తున్నట్లు ఇప్పటివరకు మా దృష్టికి రాలేదు.

– విష్ణుప్రియ, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌,

హనుమకొండ

మారటోరియం అమలు తేదీ వరకు రెన్యువల్‌ ఒత్తిడి చేయకూడదు.

అర్హులైన రైతుల పంట రుణాలను ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం రీషెడ్యూల్‌ చేయాలి.

మారటోరియం కాలంలో చెల్లింపుల కోసం వేధించకుండా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలి.

వడ్డీ రాయితీ విషయంలో కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకోవాలి. పాత రుణాల పునర్వ్యవస్థీకరణతో పాటు రబీసాగుకు కొత్త రుణాలు అందించాలి.

సహకార బ్యాంకుల రుణాలకూ వర్తించేలా స్పష్టత ఇవ్వాలి.

రైతుల డిమాండ్లు ఇవీ..

మారటోరియం ముందే చెల్లించాలని రైతులకు బ్యాంకుల ఒత్తిళ్లు

రుణాల రీసెట్‌కు ముందే వడ్డీల వసూళ్లు.. వరుస ఫోన్‌కాల్స్‌ దాడి

తీవ్ర కరువుతో చేతిలో నయాపైసా

లేక కర్షకుల అవస్థలు

డిసెంబర్‌ 8 వరకు దండుకోండి..

ఆ తర్వాత ఆగండి అన్నట్టేనా?

జిల్లాల వారీగా వివరాలు ఇలా..

జిల్లా పంట రుణలక్ష్యం

రుణఖాతాలు (రూ. కోట్లలో)

హనుమకొండ 68,999 1,451.39

వరంగల్‌ 54,122 1,540.25

జనగామ 53,631 1,784.05

మహబూబాబాద్‌ 63,799 1,770.69

భూపాలపల్లి 26,503 752.53

ములుగు 21,012 649.20

మొత్తం 2,88,066 7,948.11

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement