● బొడ్రాయితండాలో ఉద్రిక్తత
డోర్నకల్: మండలంలోని బొడ్రాయితండాలో గురువారం గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణంలో భాగంగా ఇళ్ల కూల్చివేతను స్థానికులు అడ్డుకున్నారు. నాగ్‌పూర్ నుంచి అమరావతి వరకు చేపడున్న గ్రీన్‌ఫీల్డ్ హైవే మండలంలోని తొడేళ్లగూడెం, బొడ్రాయితండా, పెరుమాళ్ల సంకీస మీదుగా వెళ్తోంది. కాగా, బొడ్రాయితండాలో ఇళ్లు కోల్పోతున్న 38మంది బాధితులకు ఆర్ అండ్ బీ శాఖ ఆధ్వర్యంలో పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించారు. ఈక్రమంలో గురువారం పోలీసుల సమక్షంలో డోర్నకల్ తహసీల్దార్ రాఘవరెడ్డి, హైవే అధికారులు బొడ్రాయితండాకు చేరుకుని ఇళ్ల కూల్చివేత పనులు చేపట్టారు. అయితే బాధితులు అడ్డుకుని తమకు ప్రత్యామ్నాయంగా ఇళ్ల స్థలాలు చూపాలని, ఇళ్లు ఖాళీ చేసేందుకు సమయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన తహసీల్దార్ రాఘవరెడ్డి మాట్లాడుతూ.. ఇప్పటికే ఇళ్లు కోల్పోయిన వారికి పరిహారం చెల్లించామని, ఇళ్లు ఖాళీ చేయాలని బాధితులకు సమయం ఇచ్చిన తర్వాతే కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఈ నేపథ్యంలో బాధితులు కూల్చివేత పనులు అడ్డుకున్నారు. సీఐ చంద్రమౌళి ఆధ్వర్యంలో పోలీసు బలగాలు ప్రవేశించడంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. అనంతరం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బాధితులు ఇళ్లు ఖాళీ చేసేందుకు నాలుగు రోజుల సమయం ఇస్తున్నట్లు తహసీల్దార్ ప్రకటించడంతో పరిస్థితి సద్దుమణిగింది.


