● సీనియర్ సివిల్ జడ్జి స్వాతిమురారి
మహబూబాబాద్ అర్బన్: విద్యార్థులు వేధింపులు, ర్యాగింగ్‌ను మౌనంగా భరించకుండా తక్షణమే తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, పోలీసులకు ధైర్యంగా ఫిర్యాదు చేయాలని సీనియర్ సివిల్ జడ్జి స్వాతిమురారి అన్నారు. మానుకోట మున్సిపల్ పరిధిలోని ముత్యాలమ్మగూడెం విద్యాభారతి పాఠశాలలో మంగళవారం విద్యార్థులకు న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వేధింపులకు గురైన విద్యార్థినులు భయం లేకుండా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే వారి వివరాలను గోప్యంగా ఉంచుతారన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అందిస్తున్న ఉచిత న్యాయ సేవలను తెలుసుకొని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ తక్కళ్లపెల్లి ప్రభాకర్‌రావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


