మహబూబాబాద్ రూరల్ : తమ బంధువు మృతిచెందగా అతడి కర్మలకు వచ్చిన ఓ బాలిక ఆడుకుంటూ వెళ్లి విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. ఈ ఘటన మంగళవారం మహబూబాబాద్ మండలం గడ్డిగూడెం తండా గ్రామంలో చోటుచేసుకుంది. రూరల్ పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ధరావత్ నరేశ్, సంధ్య దంపతులకు ఇద్దరు కుమార్తెలు కీర్తన, కీర్తిక (12) ఉన్నారు. జీవనోపాధి కోసం నరేశ్ కుటుంబం హైదరాబాద్‌కు వెళ్లింది. ఇటీవల గడ్డిగూడెం తండాకు చెందిన నరేశ్ బాబాయ్ మంగీలాల్ మృతిచెందగా ఆయన కర్మలు ఉన్నాయని కొద్ది రోజుల క్రితం ఇంటికి వచ్చారు. ఆదివారం తొమ్మిదో రోజు కర్మలు పూర్తయిన అనంతరం మంగళవారం సాయంత్రం హైదరాబాద్ వెళ్దామని ఇంటి వద్ద పనులు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో నరేశ్ చిన్న కుమార్తె కీర్తిక ఆడుకుంటూ తమ ఇంటి పక్కన ఉన్న ధరావత్ ఉమ్లా ఇంటి వద్దకు వెళ్లింది. అక్కడ వేలాడుతున్న విద్యుత్ తీగ ప్రమాదవశాత్తు ఆమె చేతికి తగిలింది. దీంతో స్పృహతప్పి పడిపోగా స్థానికులు చికిత్స నిమిత్తం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే ఆ బాలిక మృతిచెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై బాలిక తండ్రి నరేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్సై పి.రాజు తెలిపారు.
విద్యుదాఘాతంతో బాలిక మృతి
గడ్డిగూడెం తండా గ్రామంలో ఘటన


