చిట్యాల: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల పరిధిలో ఇటీవల గంజాయి తాగుతూ పట్టుబడిన ఐదుగురు యువకులను జిల్లా కోర్టు ఆదేశాల మేరకు చికిత్స, కౌన్సెలింగ్ నిమిత్తం మంగళవారం వరంగల్ ఎంజీఎంలోని డీ–అడిక్షన్ వార్డుకు తరలించినట్లు ఎస్సై పోచంపల్లి సతీశ్ తెలిపారు. మండలంలోని జూకల్ గ్రామ శివారులోని కాల్వ సమీపంలో గంజాయి తాగుతుండగా చల్లగరిగ, ముచినిపర్తి గ్రామాలకు చెందిన ఐదుగురు మ్యాదరి ప్రశాంత్, దూడపాక ప్రకాశ్, బైస బన్నీ, కుంచం బన్నీ, పసరగొండ సంజయ్ రాజ్ పోలీసులకు పట్టుబడ్డారు. వారిని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించగా గంజాయి సేవించినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. అనంతరం నిందితులను భూపాలపల్లి న్యాయస్థానంలో హాజరుపరచగా వారి భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని న్యా యమూర్తి వారిని డీ–అడిక్షన్ కేంద్రానికి తరలించా లని ఆదేశాలు జారీ చేశారు. దీంతో వారిని ఎంజీంలోని డీ–అడిక్షన్ వార్డుకు తరలించి చికిత్స అందించేలా చర్యలు తీసుకున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.


