కాశిబుగ్గ: వరంగల్ జిల్లా సంగెం మండలం వంజరపల్లి గ్రామానికి చెందిన సోమిడి త్రివేణి కవలలకు జన్మనిచ్చింది. అయితే దురదృష్టవశాత్తు వీరిలో మూడు రోజుల ఆడ శిశువు(పసికందు) శ్వాస సంబంధిత వ్యాధితో మృతిచెందింది. మృతదేహాన్ని భూమిలో పూడ్చివేయకుండా దానం చేయడానికి కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. దీంతో తెలంగాణ నేత్ర అవయవ శరీర దాతల అసోసియేషన్ ఆధ్వర్యంలో వరంగల్ ములుగు రోడ్డులోని ప్రతిమ మెడికల్ కాలేజీ అనాటమీ విభాగానికి మంగళవారం అప్పగించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు కోన్‌రెడ్డి మల్లారెడ్డి మాట్లాడుతూ పసికందు దానం సమాజానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందన్నారు. మూడు రోజుల మృత శిశువు.. భావి వైద్యులు, గైనిక్ వైద్య, శాస్త్ర పరిశోధనలకు తోడ్పతుందని తెలిపారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రాజేంద్రప్రసాద్, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


