సాక్షి, మహబూబాబాద్: నిజాంకాలం కన్నా ముందు రూపొందించిన భూ రికార్డులు కావడంతో సర్వే నంబర్లు, భూ విస్తీర్ణం, ప్రభుత్వ, ప్రైవేట్ భూముల హద్దుల నిర్ధారణలో అనేక అవకతవకలు ఉన్నాయి. దీని వల్ల జిల్లాలో భూ పంచాయితీ లేని గ్రామం లేదు. కాగా, భూ సమస్యల పరిష్కారానికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం వినూత్నంగా ఆలోచింది. ప్రతీ గ్రామంలోని భూమిని సర్వేచేసి హద్దులు నిర్ధారించాలని భావించింది. అయితే ముందుగా జిల్లాలోని 70 గ్రామాల్లో ఉన్న మొత్తం భూమిని సర్వే చేసేందుకు ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. దీంతో భూముల రీ సర్వేకు అధికారులు సమాయత్తం అవుతున్నారు.
70 గ్రామాల ఎంపిక..
జిల్లాలోని 18 మండలాల పరిధిలో మొత్తం 288 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఇందులో ఎక్కువ భూ తగాదాలు ఉన్నవి.. ప్రభుత్వ భూముల అన్యాక్రాంతం, సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న గ్రామాలను ఎంపిక చేశారు. ఇలా 70 గ్రామాల్లో రీ సర్వే చేసేందుకు ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. ఇనుగుర్తి, చిన్నగూడూరు వంటి చిన్న మండలాల్లో ఒకటి, రెండు గ్రామాలు, పెద్ద మండలాల్లో ఐదు గ్రామాల చొప్పున అన్ని మండలాలు కవర్ అయ్యే విధంగా గెజిట్‌లో గ్రామాలను పేర్కొన్నారు.
ముందస్తు ప్రచారం..
అధికారులు ఏం చేస్తున్నారో తెలియకుండా వస్తే గొడవలు అయ్యే అవకాశం ఉంది. దీంతో ముందుగా రీ సర్వే ముఖ్య ఉద్దేశం ఏమిటనే విషయంపై గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు ఉన్న అనుమానాలను నివృత్తి చేస్తారు. ఇందుకోసం స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులను సమన్వయం చేసి ఈనెల 15 తర్వాత రీ సర్వే మొదలు పెడతామని అధికారులు చెబుతున్నారు.
అధునాతన పరికరాలతో సర్వే..
జిల్లాలోని 70 గ్రామాల్లో నిర్వహించే భూముల రీ సర్వే కోసం అధునాతన పరికరాలు, పరిజ్ఞానం ఉపయోగించనున్నారు. ఇందుకోసం ఒక్కొక్కటి రూ. 5లక్షల విలువచేసే 19 రోవర్లు సిద్ధం చేశారు. అవసరాలకు అనుగుణంగా నూతన రోవర్లు కొనుగోలు చేసేందుకు ఎస్టిమేషన్ వేస్తున్నారు. గ్రా మాల మధ్య సరిహద్దుల నిర్ధారణ, గ్రామంలోని మొత్తం భూమి, అందులో ప్రభుత్వ భూములు, గుట్టలు, చెరువులు, సాగు భూమి సర్వే నంబర్‌ల వారీగా విభజన చేసి సర్వే చేస్తారు. ప్రతీ గ్రామానికి, ప్రతీ రైతుకు ఎల్‌పీఎం(ల్యాండ్‌పార్సిల్ మ్యాప్) అందజేస్తారు. జీపీఎస్ సిస్టమ్‌కు అనుసంధానం చేయడంతో మరోసారి తప్పులు జరగకుండా ఉంటుందని అధికారులు అంటున్నారు.
భూ సమస్యలకు చెక్ పెట్టేందుకే..
ప్రతీ గ్రామంలో ఉన్న భూ సమస్యలకు చెక్ పెట్టి, గొడవలు లేకుండా చూసేందుకే భూముల రీసర్వే ప్రక్రియ జరుగుతుంది. ఈ సర్వేపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రాజకీయాలకు అతీతంగా అందరూ సహకరించాలి. గ్రామాల వారీగా భూముల మ్యాప్‌లు, రైతుల వారీగా సరిహద్దులు పెట్టుకోవాలి.
–అనిల్ కుమార్, అదనపు కలెక్టర్(రెవెన్యూ)
ధరణి, భూమాత తప్పిదాల వెలికితీత
ప్రతీ భూమి సర్వేచేసి హద్దుల నిర్ధారణ
జిల్లాలో 70 గ్రామాల్లో సర్వేకు గెజిట్ విడుదల చేసిన ప్రభుత్వం
అవగాహన కల్పించే పనిలో
అధికార యంత్రాంగం
జిల్లాలో సర్వే చేసే గ్రామాల వివరాలు
మండలం గ్రామాలు
బయ్యారం సింగారం, గంధంపల్లి, కొత్తపేట, మొట్లతిమ్మాపురం, గురిమెళ్ల
డోర్నకల్ బూర్గంపహాడ్, గుర్రాలకుంట, రావిగూడెం, ముల్కలపల్లి
గంగారం పందెం, కోమట్లగూడెం, కాటినగరం
గార్ల కన్నాయిగూడెం, గోపాలపురం, చంద్రగిరి, రాంపురం, బుద్దారం
గూడూరు భూపతిపేట, మదనాపురం, గాజులగట్టు, గోవిందాపురం, కొల్లాపురం
ఇనుగుర్తి కోమటిపల్లి
కేసముద్రం ఉప్పరపల్లి, అన్నారం, రంగాపురం, ఇంటికన్నె, అర్పణపల్లి
కురవి కంచర్లగూడెం, తిరుమలాపురం, తట్టుపల్లి, నారాయణపురం, అయ్యగారిపల్లి
కొత్తగూడ పెగడపల్లి, గోవిందాపురం, మోకాళ్లపల్లి, కుందనపల్లి, బక్కచింతలపాడు
మహబూబాబాద్ సింగారం, పర్వతగిరి, జంగిలిగొండ
సీరోలు తాళ్లసంకీస
చిన్నగూడూరు ఉగ్గంపల్లి
దంతాలపల్లి కాల్వపల్లి, రామవరం, ఆగపేట, రేపోణి, బొడ్లాడ
మరిపెడ బీచురాజుపల్లి, ఉల్లెపల్లి, గిరిపురం, ఎడ్జర్ల, బురహాన్‌పురం
నర్సింహులపేట అక్కిరాల, బొజ్జన్నపేట, కౌసల్యదేవిపల్లి, వంతడపల
నెల్లికుదురు రామానుజాపురం, కాచికల్లు, రావిరాల
పెద్దవంగర పోచంపల్లి, కొరిపల్లి, బొమ్మకల్లు, పోచారం
తొర్రూరు జమస్తాన్‌పురం, ఖానాపురం, వెంకటాపూర్, కర్కాల, గోపాలగిరి, బొంతుపల్లి


