ప్రైవేట్‌ ఆస్పత్రుల నిర్వహణ సక్రమంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

ప్రైవేట్‌ ఆస్పత్రుల నిర్వహణ సక్రమంగా ఉండాలి

Jul 3 2026 12:58 AM | Updated on Jul 3 2026 12:58 AM

తొర్రూరు: ప్రైవేట్‌ ఆస్పత్రుల నిర్వహణ సక్రమంగా ఉండాలని డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్‌ సూచించారు. గురువారం డివిజన్‌ కేంద్రంలోని పలు ప్రైవేట్‌ ఆస్పత్రులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రైవేట్‌ ఆస్పత్రుల నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందించాలని, ఎలాంటి తప్పు డు పనులు చేసినా ఆస్పత్రులను సీజ్‌ చేస్తామన్నారు. కార్యక్రమంలో డాక్టర్‌ మనోహర్‌, సిబ్బంది పాల్గొన్నారు.

మరిపెడ ఏడీఏగా

పి.మురళి బాధ్యతలు

మరిపెడ రూరల్‌: మరిపెడ ఏడీఏగా పి.మురళి గురువారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో టెక్నికల్‌ ఏడీఏగా విధులు నిర్వర్తించిన ఆయనను మరిపెడ పూర్తి స్థాయి ఏడీఏగా బదిలీ చేసినట్లు అధికారులు తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మరిపెడ ఏఓ బోడ వీరసింగ్‌, ఏఈఓలు మురళిని మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు.

మున్సిపల్‌ భవనం కోసం స్థల పరిశీలన

డోర్నకల్‌: డోర్నకల్‌ మున్సిపల్‌ కార్యాలయ భవనం కోసం గురువారం మున్సిపల్‌ కమిషనర్‌ నాగరాజు స్థల పరిశీలన చేశారు. సుమారు రూ. 3.5కోట్ల నిధులతో మున్సిపల్‌ కార్యాలయ భవన నిర్మాణం కోసం స్థానిక సెయింట్‌ ఆగ్నేస్‌ పాఠశాల ఎదురుగా ఉన్న మున్సిపాలిటీకి చెందిన స్థలాన్ని పరిశీలించారు. పరిపాలనపరమైన అనుమతులు వచ్చిన తర్వాత భవన నిర్మాణంకోసం అవసరమైన ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు కమిషనర్‌ తెలిపారు. కార్యక్రమంలో టీపీఎస్‌ సంతోష్‌కుమార్‌, కౌన్సిలర్‌ గారె రమేష్‌, కాంగ్రెస్‌ నాయకులు మాదా శ్రీనివాస్‌, ఎల్లావుల హరికృష్ణ, దారావత్‌ కృష్ణ పాల్గొన్నారు.

కాడెద్దుగా మారిన రైతు

గంగారం : మండలంలోని పూనుగొండ్ల గ్రామానికి చెందిన రైతు పెనక ప్రవీణ్‌కు చెందిన జత దుక్కిటెద్దుల్లో ఒకటి ఇటీవల విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. కాగా, మరోటి కొనుగోలు చేసే ఆర్థిక స్థోమత లేదు. ప్రస్తుతం వానాకాలం సీజన్‌ ప్రారంభం కావడంతో గురువారం ఒకవైపు కాడెద్దు.. మరోవైపు రైతు భుజాలపై కాడిని మోస్తూ దుక్కులు దున్నడం కలిచివేసింది. ప్రభుత్వం స్పందించి రైతు కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement